బెంగళూరు : చంద్రయాన్ 3 విజయోత్సాహంతో ఉన్న ఇస్రో మరో కీలక ప్రయోగానికి సన్నద్ధమవుతున్నది. ఇకపై సూర్యుడిపై పరిశోధనలు జరపనున్నది. ఇందుకోసం ఆదిత్య మిషన్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. గగన్‌యాన్ ప్రాజెక్టు ఇంకా ప్రోగ్రెస్‌లో ఉందని, త్వరలోనే ఈ ప్రాజెక్టును చేపడతామని ప్రకటించారు.
సెప్టెంబర్ లేదంటే అక్టోబర్‌లో ఏదో ఒక మిషన్‌ను చేపడతామని వివరించారు. క్రూమాడ్యూల్, క్రూ ఎస్కేప్ సామర్ధాన్ని పరీక్షిస్తామని, పలు రకాల పరీక్షలు విజయవంతం అయిన తరువాత 2025లో రోదసీలోకి వ్యోమగాములతో కూడిన నౌకను పంపుతామని ప్రకటించారు. చంద్రయాన్3 కి సంబంధించి సాఫ్ట్‌ల్యాండింగ్ కోసం జాబిల్లి దక్షిణ ధ్రువాన్నే ఎందుకు ఎంచుకున్నారన్న దానికి వివరణ ఇస్తూ జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని, ఈ ధ్రువం వద్ద సూర్యరశ్మి చేరుకునే అవకాశాలు తక్కువ.
నీరు, ఖనిజాల ఉనికికి సంబంధించి ఈ ప్రాంతం మరింత శాస్త్రీయ సమాచారం కలిగి ఉండే అవకాశం ఉందని అన్నారు. చంద్రుడిపై పరిశోధనలు చేస్తోన్న శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువంపై చాలా ఆసక్తి కలిగి ఉన్నారన్నారు. మనుషులు జాబిల్లిపై ఆవాసాలను సృష్టించి, వాటిని కూడా దాటి ప్రయాణించాలనుకుంటున్నారని తెలిపారు. ఇందుకోసం ఉత్తమమైన ప్రదేశం కోసం అన్వేషణ కొనసాగుతోంది. దక్షిణ ధ్రువానికి ఆ అవకాశం ఉంది అని ఇస్రో ఛైర్మన్ మీడియాతో చెప్పారు.
చంద్రయాన్ 2 విఫలమవడంతో దాని నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేక పోయామని, ఈ నేపథ్యంలో చంద్రయాన్3లో ప్రతీదీ కొత్తగా సిద్ధం చేసినట్టు తెలిపారు. చంద్రయాన్ 2 విఫలమైన మొదటి ఏడాది అసలేం తప్పు జరిగిందో తెలుసుకునేందుకు యత్నించాం. మరుసటి సంవత్సరం ఆ లోపాల విషయంలో సవరణలు చేపట్టాం. చివరి రెండేళ్లు పరీక్షలు నిర్వహించాం. అని తెలిపారు. ఇస్రో ప్రయోగాలప కొవిడ్ ప్రభావం కూడా పడినట్టు తెలిపారు.