Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీలో మరో కృష్ణుడు

- Advertisement -
- Advertisement -

పదేళ్లకైనా సిఎంను అవుతా..

విజయదశమి వేడుకల్లో మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

పెరుగుతున్న సిఎం ఆశావహుల జాబితా

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: కాంగ్రెస్ లో సిఎం ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. సిఎం రేసులో ఉన్న కాంగ్రెస్ నేతల జాబితాలో తాజాగా మరో నాయకుడు చేరారు.ఇప్పటికే నలుగురు నేతలు తాము సిఎం పదవికి అర్హులమని చెబుతుండగా, తాజాగా మరో నేత వారికి తోడయ్యాడు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాటికి ఈ లిస్టు ఎంతగా పెరుగుతుందో? అసలే గ్రూపు కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతు న్న కాంగ్రెస్ పార్టీకి ఈ సిఎం పదవి ఆశల లొల్లి మరో తలనొప్పిగా మారబోతోంది. దసరా వేడుకల్లో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను ఇప్పటికి కాకపోయినా, మరో పదేళ్లకయినా తెలంగాణా రాష్ట్రానికి సిఎం అవుతానని చెప్పాడు. తన మనసులోని మాటను ఇన్నాళ్లు దాచుకున్నానని, విజయదశమి నాడు ఆ విషయాన్ని బయటపెడుతున్నానంటూ వ్యూహాత్మకంగా ప్రకటించారు.

తనను చిన్న తనంలోనే కౌన్సిలర్‌గా ఎన్నుకున్నారని, ఆ త ర్వాత మున్సిపల్ ఛైర్మన్‌ను చేశారని, ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని ఆ యనన్నారు. ఇదే ఆశీర్వాదం కొనసాగితే తాను ఇప్పటికి కాకపోయినా..మరో పదేళ్లకయినా సిఎం పదవిని అధిష్టిస్తానని ప్రకటించారు. దీంతో సంగారెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో తానంటే ఏమిటో ప్రజలకు తెలుసునని, తనను ఎన్నికల్లో పోటీచేయకుండా కుట్ర జరుగుతోందని, ఎందుకయినా మంచిదని ముందు జాగ్రత్తగా తన భార్యను రెడీగా ఉంచానని తనదైన శైలిలో మాస్ డైలాగ్ వదిలారు.ఇప్పటికే తెలంగాణా కాంగ్రెస్‌లో సిఎం పదవిపై పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, నల్గొండ జిల్లా అభ్యర్థులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ప్రకటించారు.

కర్ణాటకలో పార్టీ గెలిచినప్పటి నుంచి నేతల్లో జోష్ పెరిగిందని భావిస్తుండగా, ఈ పదవుల ఆశ ఆ పార్టీ నిజ స్వరూపాన్ని తెలియజేస్తోంది. ఎవరిజెండా వారిదే అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్న తీరు పార్టీ కేడర్‌లో అసహనాన్ని కలిగిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో కుమ్ములాటలు ఇంకా అలాగే ఉన్నాయి. టికెట్ రాని నేతలు, అసంతృప్తులు పిసిసి నేతల దిష్టి బొమ్మలను కాల్చగా, మరి కొందరు సిద్దం చేస్తున్నారు. సిఎం పోస్టు కోసం నేతల ప్రకటనలతో, నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరు కానీ, సిఎం పోస్టు కోసం చాలా మంది ఉన్నారని విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణా ఏర్పాటు జరిగిన సమయంలో కూడా డజన్ మందికి పైగా సిఎం పోస్టు నాదంటే నాదే..అన్న రీతిలో ప్రకటించి విమర్శల పాలయ్యారు. తీరా చూస్తే ప్రజా తీర్పుతో చతికిల పడ్డారు. అధికార బిఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించి నెలకు పైగా అయింది. వారంతా ప్రజల్లో తిరుగుతున్నారు. తమకు ఓటేస్తే కలిగే లాభమేంటో వివరిస్తున్నారు. ప్రధాన ప్రతి పక్షమైన కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయలేకపోయింది. స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఎన్ని జరుగుతున్నా… అభ్యర్థుల లిస్టు ఒక్కటి మాత్రమే బయటికి వచ్చింది. మరో లిస్టు కోసం అభ్యర్థులు, వారి అభిమానులు ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల కిత్రం పీడ దినాలు అన్నారు…ఆ తర్వాత దసరా కూడా వచ్చి పోయింది. దీపావళి కూడా త్వరలో రాబోతున్నది. ప్రచారానికి గడువు కూడా పెద్దగా లేదు.ఈ తరుణంలో రెండో జాబితా తేలకపోగా, కమ్యూనిస్టుల పొత్తు లెక్కలు కొలిక్కి రాలేదు. టిజెఎస్‌తో కలిసి పని చేసే వ్యవహారం చర్చల్లో నానుతోంది. ఇది చాలదన్నట్టు మరో కృష్ణుడు తెరపైకి రావడం విస్మయం కలిగిస్తోంది. ఇలాగైతే అత్యంత బలవంతుడయిన సిఎం కేసీఆర్‌ను ఎలా ఢీకొనగలమని, బిఆర్‌ఎస్‌ను ఏ విధంగా ఓడిస్తామో నేతలే అలోచించాలని కేడర్ ప్రశ్నిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News