Friday, November 22, 2024

రానున్న 10 రోజులు వర్షాలే..వర్షాలు

- Advertisement -
- Advertisement -

బంగాళాఖాతంలో మళ్లీ మరో అల్ప పీడనం ఏర్పడనుంది. మళ్లీ వర్షాలు ఫుల్లుగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి బంగాళా ఖాతంలో ఈనెల 6, 7 తేదీల్లో మరో అల్ప పీడనం ఏర్పడ బోతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. నవంబర్ రెండవ వారంలో బంగాళా ఖాతంలో మరో అల్ప పీడనం కూడా ఏర్పడే ఛాన్స్ ఉందని ఐఎండి ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీ లోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

తాజాగా ఏర్పడబోయే అల్ప పీడనం ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. కాగా గత నెలలో బంగాళా ఖాతంలో 3 అల్ప పీడనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే మరో అల్ప పీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడంతో తీర ప్రాంతాల అధికారులు అప్రమత్తమయ్యారు.

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ : తెలంగాణ లోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర వర్ష సూచన చేసింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో వర్షం పడొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఏపీ వాతావరణ విభాగం కూడా కీలక ప్రకటన చేసింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లా ల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తమిళనాడులో హై అలర్ట్ : ఇదిలా ఉంటే తమిళనాడుకు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీ పురానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే 48 గంటలు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం 19 జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News