Wednesday, January 22, 2025

రైతుల కోసం మరో ఉద్యమం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: యాభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఉద్యమాలను ఆందోళనలు, సమస్య లు, ఆటుపోట్లను చూశాను. గెలిచాం. ఇప్పుడు తాను మ రో నూతన ఉద్యమాన్ని భుజాలకెత్తుకున్నానని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. దేశంలోని రైతుల కష్టం చూసి రైతుల పోరాటం న్యాయమయ్యిందన్న భావనతో తాను జాతీయ రైతుల సమస్యలను తలకెత్తుకున్నానని, చిత్తశుద్దితో ప్రయత్నం కొనసాగిస్తే అసంభవం అనేది ఉండదని, తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని కచ్చితంగా మనం గెలిచి తీరుతామని ఆయన తెలిపారు. మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జో షి ప్రణీత్‌తో పాటు పలువురు రైతు నేతలు తెలంగాణ భవన్‌లో శనివారం సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో శనివారం చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ ప్రతి తాళానికీ తాళం చెవి ఉన్నట్టు ప్రతి సమస్యకు కచ్చితంగా పరిష్కారం ఉంటుందన్నారు. ఆలోచనలో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి ఉండాలన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి 1935 నుంచి పోరాటాలు సాగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సర్ చోటూరామ్, మహిందర్ సింగ్ టికాయత్, శరద్ జోషీ, చౌదరి చరణ్ సింగ్, దేవిలాల్ వంటి నేతలనుంచి నేటి గుర్నామ్ సింగ్ దాకా రైతు పోరాటాలు సాగుతూనే ఉన్నాయన్నారు. తమ హక్కుల సాధనకోసం నల్ల చట్టాలు ఎత్తేయాలని, 13 నెలల పాటు దేశ రైతులు రాజధాని ఢిల్లీ రోడ్ల మీద ఆందోళన చేశారని, వారిని కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లు అని ముద్రవేసిందని, అయినా రైతులు చెక్కుచెదరకుండా పోరాడారని ఆయన తెలిపారు.

750 మంది రైతులు అమరులైన తర్వాత

రైతుల పరిస్థితి తలచుకొని కన్నీళ్లు పెట్టుకున్నానని, వారి కోసం ప్రధాని ఒక్క మాట కూడా మట్లాడలేదని ఆయన వాపోయారు. 750 మంది రైతులు అమరులైన తర్వాత ప్రధాని దిగివచ్చి రైతులకు క్షమాపణలు చెప్పారని కెసిఆర్ తెలిపారు. పంజాబ్, యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసమే రైతులకు ప్రధాని తియ్యటి మాటలు చెప్పిండు. లేకుంటే చట్టాలను వెనక్కు తీసుకునే వాడు కాదనీ, ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదనీ, గిట్టుబాటు ధరల కోసం రైతులు ఇంకెంత కాలం పోరాడాలని కెసిఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పాటు కాకముందు మహారాష్ట్ర కన్నా ఘోరంగా ఉండేదని తెలంగాణలో కూడా రైతుల ఆత్మహత్యలుండేవని ఆయన తెలిపారు. కానీ రాష్ట్రం ఏర్పాటయినంక ఒక దారి దొరికిందని, నేడు రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో జీరో అయ్యాయని ఈ విషయం తాను గర్వంగా చెప్పగలనని కెసిఆర్ తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 94 లక్షల ఎకరాల్లో వరి పండుతుంటే ఒక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాలు వరి సాగవుతోందని కెసిఆర్ తెలిపారు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా రిజర్వాయర్‌లలో నీళ్లు ఎట్లా నిండుగా ఉన్నాయో చూస్తే మీకే అర్థమవుతుందన్నారు. ఒకటి రెండు రోజులుండి తెలంగాణలో అభివృద్ధిని పరిశీలించాలని, తెలంగాణలో ఏం చేశామో, ఎలా అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయో మీరంతా ఒకసారి చూడాలని, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని కెసిఆర్ మహారాష్ట్ర నాయకులకు సూచించారు. ఏప్రిల్ నడి ఎండల్లో కూడా తెలంగాణ చెరువులు, కాలువల్లో నిండుగా నీళ్లున్నాయని, ఎట్లున్నయి, మరి తెలంగాణలో హిమాలయాలు న్నాయా మరీ నీల్లెక్కడినుంచి వచ్చాయి, హిమాలయాలు లేవు కానీ, హిమాలయాలకన్నా ఎత్తయిన సంకల్పం ఉందని, అందుకే తెలంగాణలో నీళ్లు వచ్చాయని ఆయన తెలిపారు.

14 మంది ప్రధానులు మారినా దేశ తలరాత ఎందుకు మారలేదు ?

మన దేశంలో సహజ సంపదలకు కొదువలేదనీ, అయినప్పటికీ రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కెసిఆర్ తెలిపారు. ఒకప్పుడు సింగపూర్ ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది? ఏ వనరులు లేని సింగపూర్ అంత గొప్పగా అభివృద్ధి చెందినప్పుడు, అన్ని వనరులు ఉన్న భారతదేశం ఎందుకు వెనుకబడింది ? 14 మంది ప్రధానులు మారినా మన దేశ తలరాత ఎందుకు మారలేదు, ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఎలా ముందుకు పోతది? వాహనాల వేగం ప్రపంచంలో ఎలా ఉంది? మన దగ్గర ఎలా ఉంది? ఈ దేశంలో 83 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో41 కోట్ల ఎకరాలు మాత్రమే సాగుచేసుకుంటున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ దేశంలో మామిడి పండుతుంది, అదే సమయంలో ఆపిల్ కూడా పండుతుంది. ఇక్కడి వాతావారణం చాలా గొప్పది. నీరు కూడా అవసరానికన్నా ఎక్కువగా ఉంది. 70 వేల టిఎంసి నీటిలో కేవలం 19 వేల టిఎంసిలనే వాడుకుంటున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. 50 వేల టిఎంసీలు వృథాగా సముద్రాల పాలవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా 140 కోట్ల మంది ప్రజలు ఉన్న మనదేశంలో మన పిల్లలు పిజ్జాలు, బర్గర్లు ఎందుకు తింటున్నారు.? మెక్ డోనాల్డ్‌ను మించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఈ దేశంలో ఎందుకు నెలకొల్పలేక పోతున్నామన్న విషయాల గురించి మనం ఆలోచించాలని ఆయన సూచించారు.

రైతుల బాధలు తెలిసిన వారు నేతలైతేనే….

రైతుల సమస్యలు ఇంకా ఎందుకు పరిష్కారం కావడం లేదంటే రైతుల బాధలు తెలిసిన వారు నేతలైతేనే అది సాధ్యమవుతుందని కెసిఆర్ తెలిపారు. రైతుల సమస్యలను కేవలం రైతులే పరిష్కరించుకోగలరని ఆయన సూచించారు. తెలంగాణలో రైతు సమస్యలు పరిష్కారం అవుతున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదనీ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ బడ్జెట్ కన్నా మహారాష్ట్ర బడ్జెట్ పెద్దదని, మరి ఆ రాష్ట్ర సర్కార్ ఎందుకు రైతు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తలేదనీ, అంటే ‘దాల్ మే కుచ్ కాలా హై’ అని అర్థమవుతుందని కెసిఆర్ పేర్కొన్నారు.

రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు

తెలంగాణ తలసరి ఆదాయంలో నెంబర్‌వన్‌లో ఉందని పార్లమెంట్‌లో కేంద్రమే ప్రకటించిందని, తెలంగాణలో ఆదాయ వనరులను పెంచుకుందానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని కెసిఆర్ తెలిపారు. రాష్ట్రం రాకముందు పదేళ్ల కాలంలో ఇసుక నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కేవలం రూ.40 కోట్లు అని తెలంగాణ వచ్చాక రూ.5,500 కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు తదితర అన్ని రకాలుగా రైతుకోసం రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న మొత్తం ఖర్చు రూ.4.5 లక్షల కోట్లు అనేది వాస్తవమని ఆయన తెలిపారు. ఇంతగా రైతు పనిచేస్తున్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పనిచేయదని, కేంద్ర ప్రభుత్వం ఎందుకు రైతు కోసం పనిచేయదని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నీకేం పని మహారాష్ట్రాల్లో అంటున్నాడని, తాను ఏమంటున్నానంటే తెలంగాణ మోడల్ రైతు సంక్షేమాన్ని మహారాష్ట్రలో అమలు చేసి చూపిస్తే నేనెందుకు వస్తా..? నేను రావద్దు అంటే అభివృద్ధిని చేసి చూపించాలని కెసిఆర్ స్పష్టం చేశారు. మోడీ రాకముందు ఎఫ్‌సిఐ గోదాములు నిర్మిస్తుండే, కానీ, మోడీ వచ్చినంక ఒక్క గోదాం కట్టడం లేదని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ అదానీకి కేంద్రం గుత్తకిచ్చిందని ఆయన ఆరోపించారు. కరెంటు చార్జీలు పెంచుతున్నరు. రైతుల మోటర్లకు మీటర్లు పెడుతం మంటున్రు. పెట్టండి మీకు రైతులు మీటర్లు పెట్టడం ఖాయం అని మనం అంటున్నామని కెసిఆర్ పేర్కొన్నారు.

రైతు సంఘం నేతలతో కెసిఆర్ ఇష్టాగోష్టి

ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న రైతు సంఘం నేతలతో కెసిఆర్ ఇష్టాగోష్టి నిర్వహించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సిఎం కెసిఆర్ సమాధానాలిచ్చారు. వారి సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఒక రైతు సంఘం నేత లేచి ఒక ప్రశ్న అడిగారు. మనం ప్రజల వద్దకు పోయినప్పుడు రైతుల కోసం ఇంత డబ్బు ఎక్కడినుంచి తెచ్చి ఖర్చు చేస్తరని అడిగితే మే ఏం చెప్పాలని కెసిఆర్‌ను అడిగారు. అందుకు సమాధానంగా కెసిఆర్ మాట్లాడుతూ ఈ దేశంలో పాలక వర్గాలకు రైతులకోసం ఖర్చు చేయాలన్న సోయి 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా రాకపోవడం శోచనీయమన్నారు. వ్యవసాయ భారత దేశంలో రైతు సంక్షేమానికన్నా మించిన ప్రభుత్వ ప్రాధాన్యత ఏముంటది.? ఇన్నాళ్లు ఇక్కడి రాజకీయ నాయకులకు, అధికారులకు ఆపేరు, ఈ పేరుతో ప్రాధాన్యతాంశాలు వేరుగా ఉన్నాయన్నారు. రైతు వ్యవసాయానికి నిధులు కేటాయించాలంటే అనేక కొర్రీలు పెట్టుకుంటూ అప్రధాన్యతగా భావిస్తారని, కానీ, తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు రైతులు వ్యవసాయమే మన బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన తెలిపారు. బడ్జెట్ లో మొదట వాటికే కేటాయింపులు చేస్తామని, మన దేశానికి రాష్ట్రాలకు వచ్చిన సంపదనుంచి మొదట రైతుకు వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్ సాగునీరు పెట్టుబడి తదితర అంశాలనే ప్రాధాన్యతంశాలుగా ఎంచుకుంటుందని సిఎం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి సిఎం వారికి వివరించారు.

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రైతు సంఘం నాయకుల….

ఈ సందర్భంగా మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ ( మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రైతు సంఘం) కు చెందిన ముఖ్య నేతలు పలు జిల్లాల అధ్యక్షులు ఆఫీస్ బేరర్లు, యూత్ లీడర్లు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ యువజన అధ్యక్షుడు సుధీర్ బిందు., కైలాష్ తవార్, శరద్ మర్కాడ్, సువర్ణ కాఠే, రాంజీవన్ బోండార్, నారాయణ్ విభూధే, బిజి కాకా, అనిల్ రజంకార్, పవన్ కర్వార్, భగవత్ పాటిల్, చంద్రపూర్ జిల్లాకు చెందిన యువజన నేతలు వంశీకృష్ణ, వాసుదేవ్, సునీల్ ఠాకూర్, ఆతీఫ్ ఖాన్, దేవేందర్ లోన్కర్, రోహిత్ ముప్వార్, ఫారేఖ్ ఖాన్, రమేశ్, నాగార్జున, విక్రమ్ మోటమ్, దేవసాని అనిల్ తదితర నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపి బిబి పాటిల్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి.,ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, బిఆర్‌ఎస్ అధ్యక్షులు గుర్నామ్ సింగ్ చడోని, బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శులు రవి కోహెర్, హిమాన్షు తివారీ, మాణిక్ కదమ్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News