కాల్పులతో తరిమికొట్టిన భారత్ సైన్యం
జమ్మూ: సరిహద్దులలో ఎల్‌ఒసి వెంబడి గగనతలంలో సంచరిస్తున్న పాక్ తేలికపాటి విమానం (క్వాడ్‌క్యాప్టర్)పై భారతీయ సైన్యం కాల్పులు జరిపింది. భారతీయ ప్రాంతంలోకి చొరబడేందుకు ఈ విహంగం యత్నించింది. దీనిని గమనించి వెంటనే పల్లాన్‌వాకా సెక్టార్‌లోని జాగరూకతతో ఉన్న సైన్యం గుర్తించింది. వెంటనే కాల్పులు జరిపి, దీనిని నేలకూల్చేందుకు ప్రయత్నించారు. అయితే తప్పించుకుని ఈ విమానం పాకిస్థాన్ వైపు వెళ్లిందని వెల్లడైంది. ఈ ప్రాంతంలో భారతీయ సైన్యం కదలికలను పసికట్టేందుకు పాకిస్థాన్ సైనికబలగాలు గుట్టుచప్పుడు కాకుండా ఈ విమానాన్ని పంపించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇటీవలే జమ్మూ శివార్లలోని భారతీయ వాయుదళ స్థావరంపై పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు బాంబులు ఇతరత్రా పేలుడు పదార్థాలను జారవిడ్చాయి. తరువాత కూడా ఈ ప్రాంతంలో పలు డ్రోన్లు గగనతలంలో కన్పిస్తూ వస్తున్నాయి. అయితే ఈసారి డ్రోన్ల స్థాయిని మించి తేలికపాటి విమానాన్ని పాకిస్థాన్ పంపించిందని వెల్లడైంది. అయితే ఇప్పటివరకూ డ్రోన్లను పంపించింది పాక్ కేంద్రీకృత ఉగ్రవాదులు. అయితే ఇప్పుడు క్వాడ్‌క్యాప్టర్‌ను పాక్ సైన్యం తరలించిందని స్పష్టం అయింది.
Another Pak drone intrudes Indian space on LoC