Monday, January 20, 2025

ఫోన్ ట్యాపింగ్‌లో తెరపైకి మరో అధికారి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మలుపులే మలుపులు. భుజంగ రావు, తిరుపతన్న రిమాండ్ నివేదికలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా రిమాండ్ రిపోర్టులో అనేక విషయాలను పోలీసులు పొందుపరిచారు. డిసెంబరు 4వ తేదీన మూసీ నదిలో హార్డ్ డిస్కులను పడేసినట్లు ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో నాగోలు వద్ద మూసీలో హార్డ్ డిస్క్ శకలాలను పోలీసులు సేకరించారు. మూసీ వద్ద 5 హార్డ్ డిస్క్ కేసులు, 9 హార్డ్‌డిస్క్ ముక్కలను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. అలాగే మూసీలోనే 6 మెటల్ హార్డ్ డిస్క్ ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎస్‌ఐబి కార్యాల యంలోనూ పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. ఎస్‌ఐబి కార్యాలయంలో 12 కంప్యూటర్లు, 7 సిపియూలు, ప్రణీత్‌రావు బృందం వాడిన ల్యాప్‌టాప్, మానిటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా ఎస్‌ఐబి కార్యాలయం ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యాలయం సిసి ఫుటేజీ, లాగ్‌బుక్ ప్రతులను సేకరించారు. ఎస్‌ఐబి కానిస్టేబుల్ నరేశ్ వాంగ్మూలం పోలీసులు నమోదు చేసుకున్నారు. విపక్ష అభ్యర్థుల డబ్బుల పంపిణీపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తులపై అక్రమం గా భుజంగ రావు, తిరుపతన్న నిఘా పెట్టినట్లు వెల్లడించారు. అంతకు ముందు టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు బుధవారం తీర్పును వెలువరించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్‌పిలు తిరుపతన్న, భుజంగరావులకు పోలీస్ కస్టడీ మంగళవారంతో ముగియడంతో వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు.

ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం వారిని నాంపల్లిలో న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టారు. అనంతరం కోర్టు అదనపు ఎస్‌పిలు తిరుపతన్న, భుజంగరావులకు ఈ నెల 6 వరకు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించిన దర్యాప్తు బృందం, వీరిద్దరి వాంగ్మూలం ఆధారంగా మరింత మందికి నోటీసులు జారీ చేసి, విచారించే అవకాశం ఉన్నట్టు సమా చారం. కాగా, ఉన్నతాధికారులు చెప్పినట్లే చేశామని అదనపు ఎస్‌పిలు తిరుపతన్న, భుజంగరావులు పోలీసుల కస్టడీలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌పై పోలీసులకు వరుస ఫిర్యాదులు అందుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో విశ్రాంత పోలీసు అధికారి వేణుగోపాల్‌రావు పేరు కూడా రాధాకిషన్‌రావు ప్రస్తావించడంతో, అతడికి నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News