దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో మరొక అరుదైన ఆపరేషన్ బుధవారం ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హేమరాజ్ సింగ్ ఆధ్వర్యంలో వైద్య బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హేమరాజ్ సింగ్ మాట్లాడుతూ దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన పుట్ట వెంకటేష్ ( 40) అనే వ్యక్తి గత రెండు సంవత్సరాల నుంచి కడుపునొప్పితో బాధపడుతూ అనేక ప్రైవేట్ ఆసుపత్రులు తిరగడం జరిగింది.
కొంత మంది స్నేహితుల ద్వారా దుబ్బాక వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ చేస్తారని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగిందన్నారు. వెంకటేశుకు వైద్య బృందం అన్ని వైద్య పరీక్షలు చేసి అతని కడుపులో నుంచి 2:30 కిలోల కొవ్వును తొలగించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందనన్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు ఎవరైనా కడుపు నొప్పితో బాధ పడితే దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి వచ్చి చూయించుకోగలరని ఆయన కోరారు. ఆయన వెంట వైద్య సిబ్బంది పాల్గొన్నారు.