Friday, November 15, 2024

బెంగాల్‌లో మరో టిఎంసి నాయకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఇడి అధికారులపై మళ్లీ దాడికి యత్నం

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో రేషన్ కుంభకోణానికి సంబంధించి బొన్‌గావ్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ శంకర్ ఆద్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బొన్‌గావ్‌లో ఆద్య నివసిస్తున్నారు. ఆద్య ఇంటితోపాటు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలలో శుక్రవారం 17 గంటల పాటు సోదాలు నిర్వహించిన ఇడి అధికారులు శనివారం తెల్లవారుజామన ఆద్యను అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా ఆద్య నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంంది. ఇడి అధికారులను అడ్డుకోవడానికి ఆద్య మద్దతుదారులైన టిఎంసి కార్యకర్తలు ప్రయత్నించారు.

ఇడి అధికారుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఇడి అధికారులకు రక్షణగా వచ్చిన సిఆర్‌పిఎఫ్ బలగాలు ఆందోళనకారులపై లాఠీ చార్జీ చేశారు. సోదాల సందర్భంగా ఆద్యను ప్రశ్నించినట్లు ఇడి అధికాది ఒకరు తెలిపారు. ఆయన జవాబులు సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఆద్య అరెస్టు ను అడ్డుకోవడానికి మహిళల సారథ్యంలో కొందరు మద్దతుదారులు ప్రయత్నించారని, తమ వెంట ఉన్న సిఆర్‌పిఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయని ఆయన చెప్పారు. ఇడి అధికారులపై దాడి జరగడం గత రెండు రోజుల్లో ఇది రెండవసారి.

శుక్రవారం ఉత్తర 24 పరరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలిలో టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్‌ను ఇదే కేసులో ప్రశ్నించడానికి వెళ్లిన ఇడి అధికారలుపై ఆయన మద్దతుదారులు దాడి చేశారు. వారిని విచక్షణారహితంగా కొట్టడంతోపాటు వారి కార్లను ధ్వంసం చేశారు. ఇడి అధికారుల మొబైల్ ఫోన్లు, పర్సులను కూడా మూకలు లాక్కున్నాయి. రేషన్ కుంభకోణానికి సంబంధించి గత ఏడాది రాష్ట్ర మంత్రి, టిఎంసి నాయకుడు జ్యోతిప్రియో మల్లిక్‌ను ఇడి అధికారులు అరెస్టు చేయగా ఆయన అనుచరులుగా ఆద్య, షాజహాన్ షేక్‌ను పరిగణిస్తున్నారు.

నిలకడగా ఇడి అధికారుల ఆరోగ్యం
కాగా..శుక్రవారం టిఎంసి మద్దతుదారుల దాడిలో గాయపడిన ఇడి అధికారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారిలో ఇద్దరిని శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని డాక్టర్లు తెలిపారు. తలపై బలమైన గాయాలతో ఆసుపత్రిలో చేరిన మరో ఇడి అధికారిని ఇంకో రోజు ఆసుపత్రిలో ఉంచి ఆదివారం లేదా సోమవారం డిశ్చార్జ్ చేస్తామని వారు చెప్పారు. న్యూరాలజీ, స్పైన్, పెయిన్ స్పెషలిస్టులు ఆ ముగ్గురు అధికారులను శనివారం ఉదయం పరిశీలించారని, వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారని ఆసుపత్రికి చెందిన అధికారి ఒకరు తెలిపారు. స్వలంగా గాయపడిన ఇద్దరు అధికారులు తమకు ఒళ్లు నొప్పులు, భుజాల నొప్పులు ఉన్నట్లు చెప్పారని, వారికి అవసరమైన మందులను డాక్టర్లు రాశారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News