Monday, December 23, 2024

రైలు పట్టాలపై మరో ఘోరం

- Advertisement -
- Advertisement -

జాతి జీవనాడిగా పేరొందిన భారతీయ రైల్వే వ్యవస్థ ప్రతిష్ఠ గత కొన్నేళ్లుగా తరచూ జరుగుతున్న ప్రమాదాలతో కొడిగడుతోంది. అరవై ఎనిమిది వేల కిలోమీటర్ల మేర రైలు మార్గాలతో దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థగా అలరారుతున్న రైల్వేల పని తీరు నానాటికీ తీసికట్టు నాగంభొట్లు చందంగా మారుతోంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం- రైల్వే వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సీల్దాకు వెళ్తున్న కాంచన్ జంగా ఎక్స్‌ప్రెస్‌ను రంగపాణి స్టేషన్ సమీపంలో వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో గూడ్సు రైలుకు చెందిన అనేక బోగీలు ధ్వంసం కాగా, ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు రెండు పట్టాలు తప్పాయి. కడపటి వార్తలు అందే సమయానికి ఈ ఘటనలో తొమ్మిది మంది కన్నుమూశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేటి రోజుల్లోనూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటే రైల్వే వ్యవస్థ పనితీరు ఎంత తీసికట్టుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఘోరమైన రైలు ప్రమాదాలు జరగడానికి కారణాలు అంత ఘోరమైనవిగా ఉండనక్కరలేదనడానికి గత చరిత్రను తిరగేస్తే ఎన్నో దృష్టాంతాలు కళ్లముందు కదలాడతాయి. గత ఏడాది విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును విశాఖ- రాయగడ రైలు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో 14మంది దుర్మరణం పాలయ్యారు. విశాఖ- రాయగడ పాసింజర్ రైలు పైలట్, లోకో పైలట్ ఇద్దరూ క్రికెట్ మ్యాచ్ చూస్తూ, సిగ్నల్‌ను పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్వయంగా రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించినా, ఆ తర్వాత దర్యాప్తులో ఇందుకు ఆధారాలు లభించలేదన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా, లోకో పైలట్లు ఏమరుపాటు వహించకుండా ఉండేందుకు రక్షణ వ్యవస్థలను మెరుగుపరుస్తామని అదే సందర్భంలో రైల్వే మంత్రి ప్రకటించినా, అవి కార్యరూపం దాల్చలేదనడానికి అదే తరహాలో జరిగిన తాజా ప్రమాదమే ఉదాహరణ. ఆ మధ్య జమ్మూకశ్మీర్ నుంచి ఓ గూడ్సు రైలు.. డ్రైవర్ లేకుండానే 73 కిలోమీటర్ల దూరం నిరాఘాటంగా ప్రయాణించింది. చివరకు రైలు పట్టాలపై కలప దుంగలను పెట్టి దానిని ఆపవలసి వచ్చింది. గత ఏడాది జూన్ నెలలో ఒడిశాలో జరిగిన ఓ ప్రమాదంలో ఏకంగా మూడు రైళ్లు ఢీకొని సుమారు 300 మంది కన్నుమూయగా, 900 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ఇలాంటి సంఘటనలను చూశాక, లక్షలాది మంది ప్రయాణికులను చేరేవేసే రైళ్లు హాస్యాస్పదమైన కారణాలతో ఘోర ప్రమాదాలకు లోనుకావడం మన దేశంలోనే జరుగుతుందేమోనని అనిపించకమానదు.

రైళ్ల భద్రత కోసం భారతీయ రైల్వే ‘కవచ్’ పేరిట ఒక రక్షణ వ్యవస్థను రూపొందించింది. సిగ్నల్ ను అతిక్రమించినా, ఎదురుగా మరో రైలు వస్తున్నా లేక మితిమీరిన వేగంతో రైలు వెళ్తున్నా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నా, పట్టాలలో లోపం ఉన్నా లోకో పైలట్లను తక్షణమే హెచ్చరించడంతోపాటు రైలును ముందుకు కదలనివ్వకుండా చేసి, ప్రమాదాన్ని నివారించే ఈ వ్యవస్థ రైళ్లకు గుండెకాయలాంటిది. అయితే ఇప్పటికీ కవచ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇప్పటి వరకూ 1465 కిలోమీటర్ల రైలు మార్గాన్ని మాత్రమే ఈ వ్యవస్థతో అనుసంధానించగా, ప్రస్తుతం ప్రమాదం జరిగిన గువాహటి మార్గంలో కవచ్ ఇంకా అమలులోకి రాలేదని తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలతో రైల్వే సేవలపట్ల ప్రజలలో నమ్మకం సన్నగిల్లుతోందని చెప్పక తప్పదు. రైల్వేల ఆధునీకరణకు, భద్రతా చర్యల కోసం గణనీయమైన పెట్టుబడులు పెడుతున్నా ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉండటం రైల్వేల నిర్వహణలో సంబంధిత మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యాన్ని కళ్లకు కడుతోంది. రైళ్లు పట్టాలు తప్పడం, లోకో పైలట్ల నిర్లక్ష్యం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోటుపాట్లు, అగ్నిప్రమాదాలు, లెవల్ క్రాసింగ్ సమస్యలు- ఇవన్నీ దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచీ ఉన్నవే. వీటికి ఇప్పటికీ పరిష్కారం దొరక్కపోవడం, వీటి కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు వైద్య సహాయం అందించి, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్న పాలకులు, ప్రమాదాల నివారణకు పటుతరమైన చర్యలు తీసుకోకపోవడమే ఈ అనర్థాలకు అసలు కారణం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News