అత్యవసరంగా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి
భారత్‌లో కరోనా విజృంభణపై ఆంటోనీ ఫౌచీ కీలక సూచనలు
న్యూఢిల్లీ: భారత్‌లో రెండో దశ కరోనా ఉధృతిని కట్టడి చేయడానికి ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ పలు కీలక సూచనలు చేశారు. వెంటనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో పాటుగా చైనా తరహాలో అత్యవసర చికిత్సా కేంద్రాలను భారీ ఎత్తున ఏర్పాటు చేయడం, కరోనా పరిస్థితుల సమగ్ర పర్యవేక్షణకు ఓ కేంద్రీకృత వ్యవస్థ ఉండాలంటూ ఫౌచీ మూడు కీలక ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఆయన ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. కొవిడ్‌పై విజయం సాధించామని భారత్ ముందే ప్రకటించేసిందని ఫౌచీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం భారత్ క్లిష్టపరిస్థితిలో ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలో తాత్కాలికంగా షట్‌డౌన్ చేయడం చాలా ముఖ్యమైన అంశమని తెలిపారు. లాక్‌డౌన్ విధించడానికి ఏ దేశమూ ఇష్టపడదని.. కానీ కొన్ని వారాల పాటు లాక్‌డౌన్ విధించడం వల్ల పెద్దగా సమస్యలుఏమీ తలెత్తవని తెలిపారు.
దానికి ఆయన చైనాను ఉదాహరణగా చెప్పారు. చైనాలో వైరస్ విజృంభణ ప్రారంభమైన వెంటనే యావత్తు దేశాన్ని షట్‌డౌన్ చేశారని గుర్తు చేశారు. నెలల తరబడి లాక్‌డౌన్ చేయాల్సిన అవసరం లేదని, కొన్ని వారాలపాటు అమలు చేస్తే వైరస్ వ్యాప్తి ఆగిపోతుందని అన్నారు. అలాగే వెంటనే ఆక్సిజన్, ఔషధాలు, పిపిఇ కిట్లు సమకూర్చుకోవాలని సూచించారు. కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్ అత్యంత ప్రధానమైందని ఫౌచీ అంటూ 140 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో ఇప్పటివరకు 2 శాతం మందికి మాత్రమే పూర్తిస్థాయి టీకా అందజేశారని చెప్పారు. ఈ లెక్కన వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలతో వీలయినంత త్వరగా ఒప్పందాలు చేసుకోవాలన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ సంస్థలను ఆశ్రయించాలన్నారు.అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారయిన భారత్‌లో ఉత్పత్తి సామర్థాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని హితవు చెప్పారు.
ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలవాలని ఫౌచీ అన్నారు. కీలక వైద్య పరికరాలను సమకూర్చుకోవడానికి ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని, దానికోసం ఓ కమిషన్ లేదా అత్యవసర గ్రూపును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రభుత్వ విభాగాలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకు రావాలన్నారు. తొలుత తక్షణ అవసరాలపైనే దృష్టిపెట్టాలని, తర్వాత దీర్ఘకాలిక అవసరాల గురించి ఆలోచించాలని మోడీనేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఫౌచీ సూచించారు. భారత్ రకం వైరస్‌పై మరింత లోతుగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సిన్లు దీనిపై ఏ మేరకు పనిచేస్తున్నాయో నిర్ధారించాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటికే కొన్ని సంస్థలు భారత్ రకం వైరస్‌పై తమ టీకాలు సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రకటించాయని ఆయన గుర్తు చేశారు.