ఈ ప్రతిపాదన ప్రజాస్వామ్య వ్యతిరేకం
కోవింద్ కమిటీకి సీతారాం ఏచూరి లేఖ
న్యూఢిల్లీ: ఒక దేశం, ఒకే ఎన్నికలు ప్రతిపాదనను ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగంలో పొందుపరిచిన ఫెడరిలిజం, ప్రాథమిక సూత్రాలను హరించేవిగా సిపిఎం అభివర్ణించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఒకే దేశం, ఒకే ఎన్నికలపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి రాసిన లేఖలో ఈ ప్రతిపాదనపై తమ తీవ్ర నిరసనను తెలియచేశారు. ఈ కమిటీకి అప్పగించిన చర్చనీయాంశాలు ముందుగానే నిర్ణయించినవని, ఈ కారణంగానే తాము ఈ కమిటీ ఏర్పాటునే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏచూరి తన లేఖలో పేర్కొన్నారు.
జమిలి ఎన్నికల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి తాము దీనిపై తమ వ్యతిరేకతను, ఆందోళనను వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక దేశం, ఒకే ఎన్నికల భావనను దేశంపై రుద్దడానికి జరిగుతున్న తీరుపై తమ పార్టీ తీవ్రంగా అభ్యంతరం తెలియచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను ఆమోదించడమంటే రాజ్యాంగ ప్ఫూర్తిని వ్యతిరేకించడమేనని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకించడమేనని ఆయన తెలిపారు.
రాజ్యాంగ పీఠికను ఉటకిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాప్రతినిధులను ప్రజలు తమకు లభించిన ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారని, ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం శాసనసభకు జవాబుదారీగా ఉంటుందని ఏచూరి పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఈ అంశాలను బలహీనపరచకూడదని తాము విశ్వసిస్తామని ఆయన తెలిపారు. ఒక దేశం, ఒకే ఎన్నికలు అనే ప్రతిపాదన ప్రజాస్వామ్య వ్యతిరేకమని, మన రాజ్యాంగానికి ప్రాథమిక సూత్రమైన ఫెడరిజానికి ఇది విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై 2018లో న్యాయ కమిషన్‌కు సమర్పించిన తమ పార్టీ నివేదికను ఉన్నత స్థాయి కమిటీకి పంపిన లేఖతో ఆయన జనతచేశారు.