Sunday, February 23, 2025

మళ్లీ హిందీ వ్యతిరేక ఉద్యమం తప్పదా?

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం బలవంతంగా త్రిభాషా సూత్రం కింద హిందీ భాషను అమలులోకి తీసుకురావాలన్న ప్రయత్నాలను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో అమలు చేయడానికి ప్రయత్నించడాన్ని మొదటినుంచి ఆ రాష్ట్రం వ్యతిరేకిస్తున్న చరిత్ర ఉంది. హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేలమంది అరెస్టు అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. హిందీని అంగీకరించే రాష్ట్రాలు తమ మాతృభాషను కోల్పోతాయని, అవసరమైతే తమ రాష్ట్రం భాషా యుద్ధానికి సిద్ధంగా ఉందని తమిళనాడు డిఎంకె ప్రభుత్వం స్పష్టం చేయడం కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వివాదం రాజుకుంటోంది. జాతీయ విద్యా విధానాన్ని పూర్తిగా స్వీకరించకపోతే, ప్రస్తుతం అమలవుతున్న సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఎ) కింద రాష్ట్రానికి దాదాపు రూ. 2400 కోట్ల నిధులు కేటాయించడం కుదరదని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెగేసి చెప్పడం మళ్లీ హిందీ వ్యతిరేక ఉద్యమానికి సన్నాహాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించి కేంద్ర ప్రభుత్వానికి ఘాటుగా సమాధానం ఇచ్చారు.ఇది మీ సొంతడబ్బు కాదని, పన్నుల వికేంద్రీకరణనుండి తమ రాష్ట్రానికి రావలసిన డబ్బు వాటా మాత్రమే డిమాండ్ చేస్తున్నామని ఎత్తిచూపారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మీరు (బిజెపి) మమ్మల్ని బెదిరించాలని అనుకుంటే అది తమిళనాడులో ఎప్పటికీ జరగదు” అని చెన్నైలో డిఎంకె సారథ్యంలో జరిగిన నిరసన ర్యాలీలో స్టాలిన్ హెచ్చరించారు. ఇది ద్రావిడ భూమి, పెరియార్ భూమి… అని బిజెపికి గుర్తు చేస్తూ.. గతసారి మీరు తమిళ ప్రజల హక్కులను హరించడానికి ప్రయత్నించినప్పుడు వారు ‘గోబ్యాక్ మోడీ’ అని ఉద్యమించారు. మీరు మళ్లీ ప్రయత్నిస్తే ఈసారి ‘గో అవుట్ మోడీ’ అన్న నిరసనలతో మిమ్మల్ని వెనక్కు పంపడానికి భారీ ఎత్తున ఆందోళన లేవడం తథ్యం’ అని హెచ్చరించారు. ఉదయనిధి స్టాలిన్ హిందీని అంగీకరించడంపై ఎదురయ్యే అనర్థాలను తెలియజేస్తూ అనేక రాష్ట్రాలు తమ మాతృభాషలను కోల్పోతున్నాయని ఉదాహరణగా భోజ్‌పురి, బీహార్, హర్యానీ భాషలు హిందీ చొరబాటుతో దాదాపు అంతరించాయని వివరించారు.

త్రిభాషా సూత్రంపై దక్షిణాది రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య చాలా కాలంగా వివాదం ఉంటోంది. ఐదేళ్ల క్రితం కేంద్రం కొత్త విద్యావిధానాన్ని ప్రకటించింది. అప్పటినుంచి ఈ వివాదం మరింత వైరుధ్యంగా పెరిగింది. ఈ కొత్త విద్యావిధానం కింద విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలను నేర్చుకోవలసి వస్తుంది. వీటిలో హిందీ ఒకటి. గత వారం వారణాసిలో కేంద్ర విద్యామంత్రి ప్రధాన్ తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రత్యేకించి రాజకీయ ప్రయోజనాల కారణంగా ఈ విధానాన్ని అంగీకరించడం లేదని ఆరోపించారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని హిందీభాష చిచ్చును రగిలించి తమిళనాడును రాజకీయంగా చీలికలు తెచ్చి తమ పబ్బం గడుపుకోవాలన్నది బిజెపి ఎత్తుగడ. చారిత్రకంగా చూస్తే తమిళ ఓటర్లు బిజెపికి దూరంగానే ఉంటున్నారు. 2016లో మొత్తం 234 సీట్లలో బిజెపి పోటీచేసినా ఒక్కస్థానం కూడా దక్కలేదు. 2021లో కేవలం 20 స్థానాల్లో మాత్రమే పోటీ చేసినా, నాలుగు మాత్రమే గెల్చుకుంది. లోక్‌సభ ఎన్నికల రికార్డు చూసినా అధ్వానమే. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా సున్నాయే వచ్చింది.

తమిళనాడు చారిత్రాత్మకంగా ‘ద్విభాషా’ విధానాన్ని కలిగి ఉంది. అంటే తమిళం, ఆంగ్ల భాషలను బోధిస్తుంది. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడులో (గతంలో మద్రాస్ రాష్ట్రం, మద్రాస్ ప్రెసెడెన్సీలో భాగం) హిందీ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 1937లో సి. రాజగోపాలాచారి నేతృత్వంలోని మొదటి భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి) ప్రభుత్వం మద్రాస్ ప్రెసిడెన్సీ పాఠశాలల్లో హిందీబోధన తప్పనిసరి చేయాలని ప్రయత్నించింది. దీనికి పెరియార్ ఇవి రామస్వామి, సోమసుందర భారతీయార్, ప్రతిపక్ష జస్టిస్ పార్టీనుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మూడేళ్ల పాటు సాగిన ఉద్యమాలలో 1198 మంది అరెస్టు కాగా, ఇద్దరు మరణించారు. 1940లో తప్పనిసరి హిందీ విద్యాబోధనను ఉపసంహరించుకున్నారు. దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత, 1950 జనవరి 25న కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత అనేక హిందీయేతర రాష్ట్రాలు హిందీని ఏకైక అధికార భాష గా చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించాయి.

అప్పటి మద్రాస్ రాష్ట్రంలో డిఎంకె (ద్రవిడ మున్నేట్ర కజగం) నేతృత్వంలో హిందీ వ్యతిరేక ఉద్యమం సాగింది. 1965 జనవరిలో విద్యార్థుల మద్దతుతో హిందీ వ్యతిరేక ఉద్యమం హింసాత్మక సంఘటనలతో రెండు నెలల పాటు సాగింది. పారా మిలిటరీ ప్రమేయంతో ఇద్దరు పోలీసులతో సహా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి హిందీయేతర రాష్ట్రాలు కోరుకున్నంత కాలం ఇంగ్లీష్ అధికారిక భాషగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. దీంతో అల్లర్లు, విద్యార్థుల ఆందోళనలు సద్దు మణిగాయి. 1967లో ఇందిరా గాంధీ ప్రభుత్వం అధికారిక భాషల చట్టాన్ని సవరించింది. ద్విభాషా విధానాన్ని నిర్ధారించింది. 1968, 1986లో కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. హిందీ భాష తప్పనిసరి అని కేంద్ర ప్రకటిస్తున్నప్పుడెల్లా దాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో ఉద్యమాలు సాగుతుండడం పరిపాటి అవుతోంది. దీనిపై లేనిపోని రాద్ధాంతాలకు పోకుండా దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించినట్టు అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News