కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసిన తమిళనాడు అసెంబ్లీ
చెన్నై: బిజెపి వాకౌట్ చేసినా…దేశవ్యాప్తంగా నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ లో అనేక రాష్ట్రాలలో అవకతవకలు చోటుచేసుకుంటుంన్నందున నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం తీర్మానం చేసింది. నేషనల్ ఎల్జిబిలిటీ-కమ్-ఎంట్రెన్స్ టెస్ట్ నుంచి తమిళనాడు రాష్ట్రాన్ని మినహాయించాలని కోరింది. ప్లస్ టూ ఎగ్జామ్ మార్కుల ఆధారంగానే విద్యార్థులు మెడికల్ కోర్సులో చేరే వీలుకల్పించాలంది.
బిజెపి సభ్యులు వాకౌట్ చేసినా కూడా తమిళనాడు అసెంబ్లీ ఈ తీర్మానం చేసింది. కాగా బిజెపికి మిత్రపక్షంగా ఉన్న పాట్టాలి మక్కల్ కక్చి(పిఎంకె) మాత్రం ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్ష వివక్ష పూరితంగా ఉందని ముఖ్యమంత్రి, డిఎంకె పార్టీ అధినేత ఎం.కె.స్టాలిన్ అభిప్రాయపడ్డారు. దాని వల్ల గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు, బీద విద్యార్థులు వైద్య విద్య ప్రవేశ పరీక్షకు అనర్హులవుతారన్నారు. అందుకనే ప్లస్ టూ పరీక్ష ఫలితాల ఆధారంగానే మెడికల్ కోర్సుల ప్రవేశం ఉండాలన్నారు.
కాగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి డిఎంకె పార్టీ తీరును విమర్శించారు. ‘నీట్’ పరీక్షను బహిష్కరించకుండా ఇప్పుడేమిటీ నాటకం అని విమర్శించారు. ‘‘ఇప్పుడు అసెంబ్లీలో మళ్లీ మూడోసారి తీర్మానం చేయడంలో ఉద్దేశం ఏమిటి?’’ అని నిలదీశారు. ఇది డిఎంకె పార్టీ ఆడుతున్న మరో రాజకీయ నాటకం అని విమర్శించారు. ఇలాంటి కల్లబొల్లి నాటకాలను ప్రజలు నమ్మబోరని ఏఐఏడిఎంకె అభిప్రాయపడింది.