Monday, December 23, 2024

మోడీ పాలనంతా ప్రజావ్యతిరేకమే!

- Advertisement -
- Advertisement -

రెండు నెలల్లో 10 సంవత్సరాల మోడీ పాలన పూర్తి అవుతుంది. ఈ పది సంవత్సరాల ఆయన పాలనను గమనిస్తే అన్ని రంగాల్లోనూ విఫలత వెల్లడవుతుంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ఫలితంగా గ్రామీణ, పట్టణ పేదలు, కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారు. ఉపాధి లేమి తో నిరుద్యోగం పెరుగుతూ ఉంది. పేదరికం, నిరుద్యోగం పెరుగుతుండగా ఇంకొక వైపు సంపద కేంద్రీకరణ పెరుగుతున్నది. మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల దేశం అప్పుల్లో కూరుకుపోతూ ఉంది. భారత దేశంలో పని చేసే జనాభాలో 50% పైగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత ప్రాధాన్యత గల వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వ సంక్షోభంలోకి నెడుతూనే ఉంది.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ అందుకు విరుద్ధంగా రైతాంగ వ్యతిరేక విధానాలు అమలు జరుపుతున్నారు. పంటలకు న్యాయమైన మద్దతు ధరలు ప్రకటించి వాటికి చట్టబద్ధత కల్పించడానికి వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, పంటలకు న్యాయమైన ధరలు లభించకపోవడం వల్ల వ్యవసాయం ద్వారా నామమాత్రపు ఆదాయమే లభిస్తున్నది.

జాతీయ గణాంకాల శాఖ 2021 సెప్టెంబర్ 10న ప్రకటించిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం చిన్న రైతులకు వ్యవసాయం ద్వారా రోజు వారీ సగటు ఆదాయం 27 రూపాయలు. నెలకు రూ. 816 కాగా, సంవత్సరానికి 3,898 రూపాయలు మాత్రమే. వ్యవసాయ ఆదాయంతో పాటు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం కలుపుకుంటే కుటుంబ ఆదాయం కొంత పెరుగుతుంది. పంటలకు న్యాయమైన ధరలు లభించక రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. 2012- 13లో వ్యవసాయ కుటుంబాల సగటు అప్పు రూ. 47వేలు కాగా, నేడు రూ. 80 వేలకు పైగా ఉంది.

మోడీ పాలనలో అప్పుల పాలైన లక్షా 25 వేల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2020లో మూడు వ్యవసాయ చట్టాలు చేసి మద్దతు ధరల ప్రకటన నుండి, పంటల కొనుగోళ్ళ నుండి తప్పుకోనున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించింది. తమ పంటలు ఇష్టమైన ధరకు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చనే మాయ మాటలతో రైతులను బడావ్యాపారుల కబంద హస్తాల్లో పెట్ట చూసింది. రైతులు ప్రమాదకర చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించడంలో ఆ చట్టాలను రద్దు చేసినా దొడ్డిదారిన అమలు జరుపుతూనే ఉంది. ఎరువులు, విత్తనాల ధరల పెరుగుదల అరికట్టలేకపోయింది. రైతులకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించుకుంటూ వస్తున్నది. వ్యవసాయాన్ని దండగ అన్నఅభిప్రాయం రైతాంగంలో కలుగజేసి, వారి భూము లు కాంట్రాక్టు వ్యవసాయానికి, కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలు అమలు జరుపుతున్నది. ప్రభుత్వ విధానాల ఫలితమే నేటి వ్యవసాయ సంక్షోభం.

అధికార మార్పిడి దగ్గర నుండి నేటి మోడీ పాలన వరకు దేశ ప్రయోజనాలకు అనుగుణమైన పారిశ్రామిక విధానం అమలు జరగలేదు. సామ్రాజ్యవాదులు, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా పారిశ్రామిక విధానం అమలు జరుగుతున్నది. మోడీ పాలనలో పారిశ్రామిక విధానం బడా పెట్టుబడిదారుల చుట్టూ తిరుగుతున్నది. వలస పాలనలోను, అధికార మార్పిడి తర్వాత సామ్రాజ్యవాదులకు, విదేశీ పెట్టుబడిదారులకు, దళారీలుగా వ్యవహరించిన టాటా, బిర్లాల చట్టూ పారిశ్రామిక విధానం చాలా కాలం కొనసాగితే, నేడు ప్రధాని మోడీకి ప్రియమైన అదానీ, అంబానీల చట్టూ తిరుగుతున్నది. తన ఇష్టులైన వారికి ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ కట్టబెడుతున్నారు.

పెట్టుబడిదారులకు అనేక రాయితీలు ఇస్తున్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు బ్యాంకులకు బడా పెట్టుబడిదారులు బాకీ పడిన రూ. 10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసింది. దేశంలోని అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను చవకగా అమ్మిడం ద్వారా కార్పొరేట్ల దోపిడీకి దేశాన్ని నిలయంగా మార్చారు. 2015- 2022 మధ్య కాలంలో రూ. 6.50 లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ఆశ్రితులకు ప్రధాని మోడీ కట్టబెట్టారు. గత పది సంవత్సరాల్లో లాభాల్లో ఉన్న 64 కేంద్ర ప్రభుత్వ సంస్థలను మూసి వేసి వాటిని అమ్మ చూస్తున్నది. వ్యవసాయ రంగానికి తోడ్పాటుగా ఉన్న ఎరువుల రంగంలోని 8 ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు రంగం సిద్ధం చేసింది.

సంపద పన్నును రద్దు చేసింది. కార్పొరేట్ పన్నును 30 నుంచి 22% తగ్గించింది. ఫలితంగా దేశానికి రూ. లక్షా 84 వేల కోట్ల నష్టం జరిగింది. 2021లో ప్రభుత్వ రంగ సంస్థలు జరిపిన సర్వే వివరాల ప్రకారం దేశంలోని 255 ప్రభుత్వ రంగ కంపెనీల్లో 177 కంపెనీలు నికర లాభాన్ని గడించటం గమనిస్తే, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, వాటిని అమ్మివేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పేది ఎంత బూటకమో తెలుస్తున్నది. భారత దేశంలో విదేశీ పెట్టుబడులు 2020 నాటికి 13% పెరిగి 57 మిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి. మోడీ పాలనలో పారిశ్రామిక విధానం దేశ, విదేశీ బడా పెట్టుబడిదారుల దోపడీ ప్రయోజనాలకే ఉపయోగంగా మారింది.

ఉపాధి, నిరుద్యోగం యువతను తీవ్రంగా వెంటాడుతున్నది. యువతలో ఉన్న అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికీ ఎన్‌డిఎ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ 2014 ఎన్నికల ప్రచారం ప్రకటించారు. దీనికి నిరుద్యోగ యువత ప్రభావితమై ఎన్‌డిఎకు అనుకూలంగా మారారు. ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి రావడానిక యువత ఓట్లు బాగా దోహదపడ్డాయి.

అధికారాన్ని చేపట్టిన మోడీ ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమైంది. మోడీ విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది. దేశంలో 15 సంవత్సరాలు అంత కంటే ఎక్కువ వయసు గల గ్రాడ్యుయేట్లలో 13.4% మంది నిరుద్యోగంలో మగ్గుతున్నారని కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీరియాడిక్ లేబర్ సర్వే జూన్ 2022లో వెల్లడించింది. కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరైన అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఇటీవల విడుదల చేసిన సర్వే మేరకు 25 సంవత్సరాల గ్రాడ్యుయేట్లలో 42.3% నిరుద్యోగులుగా, ఉన్నత మాధ్యమిక విద్య పూర్తి చేసిన వారిలో 21.4% నిరుద్యోగులుగా ఉన్నారని పేర్కొన్నది.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 నాటికి 10.05% నిరుద్యోగ రేటు పెరిగింది. 2021 ప్రారంభం నుంచి నేటి వరకు 2.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కనీసం భారతదేశం 2 కోట్ల ఉద్యోగాలు అవసరం కాగా, అందులో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.2012లో నిరుద్యోగం 2.1% ఉండగా, అది 2018లో నేషనల్ సర్వే సంస్థ ప్రకారం 6.1% పెరిగింది. మోడీ 2014లో అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో 22.4% మందికి ఉపాధి లేదు. మోడీ పాలన 9 సంవత్సరాల్లో సగటు 24.74% కి పెరిగింది.

అధికార మార్పిడి జరిగినప్పుడు వలస పాలకుల కార్మిక చట్టాలే అమలులో ఉన్నాయి. భారత్‌లో కొత్త లేబర్ కోడ్‌లు తయారు చేయటానికి 2013 యుపిఎ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. తన సిఫార్సులను కమిటీ ఆగస్టు 2018 మోడీ ప్రభుత్వానికి అందిందించింది. బిజెపి మొదటి నుంచి కార్మిక వ్యతిరేకత కలిగి ఉంది. మోడీ నాయకత్వాన 2014లో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కార్మిక వ్యతిరేక విధానాలతో కార్మిక చట్టాల సవరణకు పూనుకున్నది. 2015లో జరిగిన 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ లో మోడీ మాట్లాడుతూ అనవసరమైన కార్మిక చట్టాలు తొలగించబడుతున్నాయని అన్నారు.

అదే సమయంలో కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఉన్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు. జులై 2015లో కార్మిక చట్టాలలో సవరణలు జరుగుతాయని నొక్కి మరీ మోడీ అన్నారు. కార్మిక సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కార్మిక వర్గం తీవ్ర వ్యతిరేకత వల్ల మోడీ ప్రభుత్వం వెంటనే కార్మిక చట్టాలను సవరించకుండా, సవరణ గురించి ప్రచారం చేస్తూ 2022లో 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మారుస్తూ జిఒ విడుదల చేసి 2023లో పార్లమెంట్ ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. కార్మిక వర్గాలు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు నాలుగు లేబర్ కోడ్ ల ద్వారా మోడీ ప్రభుత్వం హరిస్తూ, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడింది. వారికి విశేష అధికారాలు కల్పించింది.

300 కంటే ఎక్కువ కార్మికులు ఉన్న సంస్థల్లో మాత్రమే ఉద్యోగులను తొలగించడానికి, లే ఆఫ్ లేదా రిట్రెంచ్ చేయటానికి ప్రభుత్వ ముందస్తు అనుమతి కావాలి. అంతకు తక్కువ ఉన్న సంస్థల్లో ముందస్తు అనుమతి తీసుకోకుండా పరిశ్రమ అధిపతులకు నిర్ణయం తీసుకునే అధికారం కల్పించబడింది. సమ్మె నోటీసు ఇవ్వడానికి గడువును 18 నుండి 60 రోజులకు పొడిగించింది. పని గంటలను 8 నుండి 12 గంటలకు మార్చింది. ట్రిబ్యునల్స్‌లో వివాదాలు నడుస్తున్న సమయంలో సమ్మెలకు వెళ్ళడం నిషేధింంది. ఇవన్నీ కార్మికుల హక్కులను కాలరాచేవే. కార్మికులను తొలగించడానికి, లే ఆఫ్‌లు ప్రకటించడానికి యజమానులకు హక్కులు కల్పించబడ్డాయి.

ఇది కార్మికులను యజమానులకు బానిసలను చేయడమే. నాలుగు లేబర్ కోడ్‌ల ద్వారా మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు వెల్లడవుతున్నాయి. పౌరసత్వ చట్ట సవరణల మతాల మధ్య, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నది. ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలపై రాజ్యాంగ సంస్థలను ప్రయోగించి, కేసులు బనాయించి జైళ్ల పాలు చేస్తున్నది. ఈ విధంగా ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలన సాగిస్తున్నది. మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలనను దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News