Monday, December 23, 2024

ఒటిటిలో పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరి.. కేంద్రం ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఇకపై ఓటీటీ (ఓవర్‌దిటాప్) ప్లాటఫామ్స్ లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కొత్త నిబంధనలతో బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిబంధనలను అమలు చేయడంలో ప్రచురణ కర్తలు విఫలమైతే కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేసింది.

సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రచార నిషేధానికి సంబంధించిన 2004 నాటి చట్టంలో నిబంధనలను సవరిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఓటీటీ ప్లాటఫామ్స్‌కు జనాదరణ రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో ముఖ్యంగా మైనర్ల మనసులపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ హెచ్చరికల వల్ల కొంత వరకు ప్రయోజనం ఉండవచ్చని భావిస్తోంది. పొగాకు ఉత్పత్తుల ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనలను నిరోధిస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఈ నిబంధనలను అమలు చేయడం ద్వారా టొబాకో రెగ్యులేషన్ల అమలులో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ముందంజలో ఉంటుంది.

ఓటీటీ మాధ్యమాల్లో ప్రదర్శించే వెబ్ సిరీస్‌లు, సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాల్లో పొగాకు వినియోగానికి సంబంధించిన దృశ్యాలుంటే “పొగాకు వినియోగం క్యాన్సర్ కారకం,ప్రాణాంతకం” అని సినిమా థియేటర్లు, టీవీల్లో ప్రదర్శించినట్టు గానే ఓటీటీల్లోనూ కార్యక్రమం ప్రారంభానికి ముందు, మధ్యలో కనీసం 30 సెకన్ల పాటు పొగాకు దుష్ప్రభావాన్ని వివరించేలా ప్రకటన ప్రదర్మించాలి. దీంతోపాటు పొగాకు ఉత్పత్తులను , వాటి వినియోగాన్ని చూపే దృశ్యాలు వచ్చినప్పుడు డిస్‌క్లెయిమర్ ( నిరాకరణ) ను చూపించాలని పేర్కొంది.

ఇది నిబంధనలకు తగినట్టు తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌లో నలుపు రంగులో ఉండాలని ఆరోగ్యశాఖ పేర్కొంది. ఓటీటీ కంటెంట్ ఏ భాషలో ప్రసారమౌతుందో అదే భాషలోనే ఈ హెచ్చరికల ప్రకటనలు ఉండాలి. ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని విచ్చల విడిగా చూపుతుండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు పాటించకుంటే ఆరోగ్య, సమాచార ప్రసార , ఐటీ శాఖల ప్రతినిధులు చర్యలు తీసుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News