లండన్: కొవిడ్-19 ఇన్‌ఫెక్షన్ తర్వాత ఏడు నెలలపాటు ఇమ్యూనోగ్లోబ్యులిన్ జి(ఐజిజి) యాంటీబాడీలు స్థిరంగా ఉన్నాయని, 75 శాతం మందిలో వాటి సంఖ్య మరింత పెరిగిందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్‌ను కట్టడి చేయడంలో ఐజిజిది కీలక పాత్ర. స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలను నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో శుక్రవారం ప్రచురించారు. 578మంది ఆరోగ్య కార్యకర్తలపై ఏడు నెలలపాటు ఈ అధ్యయనం జరిపారు. మహమ్మారి ప్రపంచానికి వ్యాపించిన ప్రారంభదశలోనే అధ్యయనాన్ని ప్రారంభించారు. 2020 మార్చి నుంచి అక్టోబర్ వరకు నాలుగుసార్లు బ్లడ్ శాంపిళ్లు తీసుకొని పరీక్షించారు. ఐజిఎ,ఐజిఎం,ఐజిజి యాంటీబాడీలు ఏస్థాయిలో అభివృద్ధి చెందిందీ లెక్కించారు. మానవుల్లో జలుబుకు కారణమైన కరోనా వైరస్ సోకినవారిలో తయారైన యాంటీబాడీలున్నవారికి కొవిడ్19ను నిలువరించే శక్తి ఉన్నట్టు ఈ అధ్యయనంలో గుర్తించారు. కొవిడ్19 సోకినపుడు అసింప్టమేటిక్‌గా ఉన్నవారిలో జలుబు వైరస్‌కు సంబంధించిన యాంటీబాడీలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు.