ఫ్లోరిడా యూనివర్శిటీ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి
వాషింగ్టన్ : కొవిడ్ టీకా తీసుకున్న తల్లుల పాలలో యాంటీబాడీల సరఫరా గణనీయంగా ఉంటుందని దానివల్ల బిడ్డలకు అస్వస్థత నుంచి రక్షణ కలుగుతుందని అమెరికా లోని యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. జర్నల్ బ్రెస్ట్ ఫీడింగ్ మెడిసిన్‌లో ఈ అధ్యయనం వెలువడింది. కొవిడ్ టీకాలు తల్లులకే కాకుండా బిడ్డలకు కూడా రక్షణ కలిగిస్తాయని అధ్యయనం స్పష్టం చేసింది. గర్భిణి కానీ పాలిచ్చే తల్లి కానీ వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోడానికి తోడ్పడుతుందని వివరించింది.
వ్యాక్సినేషన్ వల్ల కొవిడ్‌కు వ్యతిరేకంగా గణనీయంగా యాంటీబాడీలు తల్లి స్తన్యంలో పెరుగుతాయని, అలాగే వ్యాక్సిన్ పొందిన తల్లులు తమ ఇమ్యూనిటీని తమ బిడ్డలకు సరఫరా చేయగలుగుతారని అధ్యయనంలో పాలుపంచుకున్న సీనియర్ శాస్త్రవేత్త జోసెఫ్ లార్కిన్ చెప్పారు. ప్రసవించిన బిడ్డల్లో వారి ఇమ్యూన్ వ్యవస్థ అంతగా వృద్ధి చెంది ఉండదని, అందువల్ల బిడ్డలు స్వయంగా ఇన్‌ఫెక్షన్లతో పోరాటం సాగించే సత్తా ఉండదని పరిశోధకులు వివరించారు. అలాగే వ్యాక్సిన్లకు అనుకూలంగా స్పందించే వయస్సు కాదని, ఇలాంటి దుర్భర పరిస్థితిలో తల్లిపాలే ఆయా బిడ్డల్లో ఇమ్యూనిటీని పెంపొందిస్తుందని పరిశోధకులు వివరించారు.