కాక్ టెయిల్ ఓ బ్రహ్మాస్తం
రూ.70వేలతో డ్రగ్‌ను పంపిణీ చేస్తాం: ఎఐజి చైర్మన్
మన తెలంగాణ/హైదరాబాద్: కొవిడ్ వైరస్‌కు వ్యతిరేఖంగా పనిచేసే కాక్ టెయిల్ ఓ బ్రహ్మస్తమని ఏఐజి చైర్మన్ డా నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ మందు తీసుకున్న వెంటనే యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయన్నారు. దీంతోనే ఏఐజి హాస్పిటల్లో ఈ మందుతో గురువారం నుంచి చికిత్స ప్రారంభించినట్లు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ మందును వినియోగిస్తే 70 శాతం మందికి హాస్పిటలైజేషన్, డెత్స్ తగ్గినట్లు క్లినికల్స్ ట్రయల్స్‌లో తేలినట్లు ఆయన వివరించారు. అయితే 65 ఏళ్లు పై బడిన వారు, డయబెటిక్ పేషెంట్లు, హార్ట్ సమస్యలున్నోళ్లు, వ్యాధి నిరోధక శక్తి తగ్గే మందులు వాడుతున్న వారు, క్యాన్సర్ పేషెంట్లు లక్షణాలు తేలిన 3 నుంచి 7 రోజుల్లోనే వాడాలన్నారు.
దీంతో కేవలం వారం రోజుల్లోనే ఆర్టిపిసిఆర్ నెగటివ్ వస్తుందన్నారు. అయితే గర్బిణీలు మాత్రం ఈ మందును వాడకూడదన్నారు. ఈ మందుతో వచ్చే యాంటీబాడీలు వెంటనే వైరస్‌పై ఉండే స్పైక్ ప్రోటీన్‌ను నియంత్రిస్తాయన్నారు. అంతేగాక కణాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటాయన్నారు. దీంతో ఆక్సిజన్ లెవల్స్ తగ్గకుండా ఉంటాయన్నారు. మరోవైపు వైరస్ మ్యూటేషన్ అయినప్పటికీ ఈ మందు సమర్ధవంతంగా పనిచేస్తుందన్నారు.ఈ మందును వినియోగించిన పేషెంట్లు కనీసం మూడు నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అయితే తమ ఆసుపత్రిలో రూ. 70 వేలతో ఈ మందు చికిత్సను నిర్వహిస్తున్నట్లు డా నాగేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.
Antibody cocktail available for Covid 19 Treatment