న్యూఢిల్లీ : రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్న కేసులో బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ముందస్తు బెయిలు లభించింది. రూ. 50 వేల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తానికి పూచీకత్తు సమర్పించడంతో ప్రత్యేక న్యాయమూర్తి శైలేంద్ర మాలిక్ ఆమెకు బెయిలు మంజూరు చేశారు. అంతకు ముందు కోర్టు నటిపై లుక్‌అవుట్ నోటీసు జారీ చేసినప్పటికీ దర్యాప్తు సమయంలో ఆమెను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. నచ్చనివారిని అరెస్టు చేసి, నచ్చినవారిని వదిలేసే విధానాన్ని ఎందుకు అనుసరిస్తున్నారని ఈడీని కోర్టు నిలదీసింది.
నవంబర్ 10 వ తేదీన జరిగిన విచారణలో జాక్వెలిన్ తరఫు న్యాయవాది సిద్ధార్ధ్ అగర్వాల్ తన క్లయింట్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించినప్పుడు దేశం నుంచి ఆమె పారిపోతారని, సాక్షాలను తారుమారు చేస్తారని ఆరోపించడం న్యాయం కాదని వాదించారు. జాక్వెలిన్‌ను పలుమార్లు ప్రశ్నించేందుకు పిలిచిన ఈడీ తొలిసారిగా సప్లిమెంటరీ ఛార్జిషీటులో జాక్వెలిన్ పేరును ప్రస్తావించింది. అయితే అంతకు ముందు సమర్పించిన ఛార్జిషీట్‌లో కానీ, సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో కానీ జాక్వెలిన్ పేరును ఈడీ ఎక్కడా నిందితురాలిగా పేర్కొనలేదని న్యాయవాది పేర్కొన్నారు. అయితే వాటిలో జాక్వెలిన్, ఆమె సహనటి నోరా ఫతేహి నుంచి తీసుకున్న వాంగ్మూలానికి సంబంధించిన వివరాలను ఈడీ పొందుపరిచింది.