నది ప్రవాహ మార్గాలు, హద్దులు (గట్లు) దాటి జలప్రవాహం నిలువరించలేకపోవడం వల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే స్థితిని వరద అంటారు. భారత దేశంలో అనేక ప్రాంతాల్లో విభిన్న భౌగోళిక పరిస్థితులు శీతోష్ణస్థితులు వర్షపాతం ఉండడం వల్ల ఏదో ఒక ప్రాంతంలో అనూహ్యమైన వరదలు సంభవిస్తున్నాయి. అధిక వర్షపాతం జూన్ నుండి సెప్టెంబర్ నెలల మధ్యవుంటుంది. ఈ కాలంలో వరదలు సంభవించే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. తుఫాన్లు వాయుగుండం. అధిక వర్షపాతం. ఉష్ణోగ్రతలో మార్పులు, మంచు కరగడం, సునామీల వల్ల వరదలు వస్తాయి. మన దేశంలో సుమారు 3290 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో భూమి వరద ముంపుకు గురయ్యే ప్రమాదం వుందని అంచనాలు తెలుపుతున్నాయి. ప్రతి యేటా దాదాపు 78 లక్షల హెక్టార్ల భూమి వరద ప్రభావానికి గురిఅవుతుంది.ఏటా దాదాపు 1700 మంది వరదల వల్ల మరణిస్తున్నారు. యేటా రూ. 1805 కోట్ల రూపాయల ఆస్తి, పంటనష్టం జరుగుతుందని, ఇండు, రోడ్లు, జాతీయ రహదారులు, వంతెనలు, కాలువలు దెబ్బతిన్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 1977లో అత్యధికంగా 11,316 మంది మృత్యువాతపడ్డారు. వరదల వల్ల ప్రతి ఏటా సగటున 1464 మంది మరణిస్తున్నారు. 86,288 పశువులు చనిపోతున్నాయి.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు వరదల విధ్వంసానికి గురవుతున్నారు. 12వ పంచవర్ష ప్రణాళిక వర్కింగ్ గ్రూప్ గణాంకాల ప్రకారం 1953 -2010 మధ్య ప్రతి ఏటా సగటున 7.208 మిలియన్ల హెక్టార్ల భూమి, 3.19 మిలియన్ల ప్రజలు వరదల ప్రభావానికి గురైనారనీ సర్వేలు వెల్లడిస్తున్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో వరదలు సంభవించే అవకాశాలు వున్నాయి. దేశంలో కొన్ని ప్రాంతాలలో ఏడాది పొడువునా వరదలు వస్తుంటాయి.దేశ భూభాగంలో సుమారు 30% వరకు వరదలుచేత ప్రభావితం అవుతుంది.దేశం మొత్తం మీద 39 జిల్లాలు తీవ్ర వరద ముప్పు ఉన్న జిల్లాలుగా గుర్తించారు. 10 మిలియన్ హెక్టార్ల భూమి ప్రతి యేడాది పునరావృతమయ్యే వరదల ప్రభావానికి గురవుతుంది. దేశంలో వరద ముప్పు ఉన్న 50 మిలియన్ల హెక్టార్లలో ఉత్తరప్రదేశ్ 24.9%, బీహార్15% మిగిలిన రాష్ట్రాలు 45% ముప్పు ప్రాంతాలను కలిగి వున్నాయి. దేశం విస్తీర్ణంలో 8 శాతం భూభాగం వరదలకు గురవుతున్నటు అంచనాలు తెలుపుతున్నాయి.
వరదలకు కారణాలు: 1. నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడం. నది ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల వరదలు వస్తాయి 2). తుపానులు అధిక వర్షపాతం, వాయుగుండాలు వరదలకు కారణం అవుతాయి 3). నది వేదిక పెరగడం, నదులు, చెరువులు, కాలువలకు నదీ ప్రవాహ మార్గాలలో పూడికతో నిండిపోవడం నీరు ప్రవహించడానికి అడ్డంకి ఏర్పడడం వల్ల వరదలు వస్తాయి 4). అతిగా అడవులను నరికివేయడం, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల వరద ల ఉధృతి పెరుగుతుంది. 5) కొండ చరియలు విరిగిపోవడం వల్లనదులు తమ ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల వరదలు వస్తాయి 6). ఆనకట్టలు, చెరువులు గట్ల నిర్మాణంలో సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలు పాటించకపోవడం 7). నాసిరకం నిర్మాణాలు చేయడం వల్ల చెరువులు, కుంటలు తరచుగా గండి పడి వరదలు వస్తాయి. 8). భూతాపం కారణంగా అధిక నీటి ప్రవాహం నిలిచి వరదలు సంభవిస్తాయి. 9) భూకంపాల వల్ల నదులు దిశ మారి వరదలు వస్తాయి. 10) పట్టణ భవన నిర్మాణాల వల్ల మహా నగరాలలో నాళాలు డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణ లోపం 11). ప్లాస్టిక్ కవర్లను డ్రైనేజీలు వేయడం చెత్త వ్యర్థ పదార్థాలతో డ్రైనేజ్ నిండిపోవడంతో నీటిప్రవాహాన్ని అడ్డుకుంటాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదలకు గురిఅవుతున్నారు. హైదరాబాద్, ముంబాయి, మద్రాస్ మొదలగు మహా నగరాల్లో పట్టణ ప్రణాళిక నిర్వహణలో నెలకొన్న లోపాలు, పర్యవేక్షణ మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల లోతట్టు ప్రాంత వాసులు తరుచుగా వరదలతో సహ జీవనం చేసే స్థితి నెలకొనడం శోచనీయం. వర్షం పడినప్పుడు నీరు భూమిలోకి ఇంకే విధంగా సరైన ప్రణాళికలు లేకపోవడం, నీరు ఇంకే మార్గాలను పూర్తిగా అడ్డుకోవడం వల్ల తరచుగా వర్షాకాలంలో వరదలు తాకిడిని వేసవి కాలంలో నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. వరదలకు ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు నది తీర ప్రాంతాలలో తరచుగా వరదలకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను వరదలు రావడానికి ముందుగానే తరలించాలి. వారికి పునరావాస సౌకర్యాలు కల్పించాలి. దీని వల్ల వరదల సమయంలో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చు. దగ్గరలోని పునరావాస కేంద్రాన్ని గుర్తించి అక్కడికి ప్రజల తరలించాలి. ఎత్తయిన మార్గాలను ఏర్పాటు చేసుకోవాలి.
వైద్య ఆరోగ్య సౌకర్యాలను ముందస్తుగానే సమకూర్చుకోవాలి. ప్రత్యేకంగా డయేరియా, తేలు, పాము కాటుకు సరైన ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలి. మీడియా, టెలివిజన్ ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా వరదలవల్ల వచ్చే ముప్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రచారం చేయాలి. టార్చిలైట్ బ్యాటరీలు, గొడుగులాంటివి సమకూర్చుకోవాలి. తాగడానికి మంచి నీరు, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు బట్టలు, సామాగ్రిని నిల్వచేసుకోవాలి. వాటర్ ప్రూఫ్ దుస్తులను, ఇతర విలువైన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎత్తైన ప్రదేశాలనుగుర్తించి పశువులను అక్కడికి తీసుకు వెళ్లే ఏర్పాటు చేసుకోవాలి. వరద తాకిడికి గురైన ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సురక్షితమైన నీటిని తాగాలి లేనిచో కలరా, డైరియరియా లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఆహార పదార్థాలు వరద నీటిలో తడవకుండ జాగ్రత్త పడాలి. నీటిని బ్లీచింగ్ పౌడర్‌చే శుభ్రపరచాలి. వరద నీటిలోకి వెళ్ళకూడదు. తెగిపడిన విద్యుత్తు తీగలను తాకరాదు. నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, దుస్తులు, మందులు దగ్గర వుంచుకోవాలి. నివాస ప్రాంతం త్వరలో ముంపుకు గురవుతుందని తెలియగానే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. వరద తాకిడికి గురయ్యే ప్రాంత ప్రజలకు ప్రత్యేక బీమా సౌకర్యం కల్పించాలి. ఆర్థిక నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. వస్తువులను ఎత్తైన ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో పశువులు, వ్యవసాయ సామగ్రి, ఇతర సామగ్రి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చెయ్యాలి. వరదల వల్ల ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరుగుతుంది.ఇల్లు, పంట పొలాలు దెబ్బతింటున్నాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడం వల్ల అది వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. ఆహార కొరత ఏర్పడుతుంది. వరదల వల్ల ప్రజలు నిరాశ్రయులు అవుతారు. పశువులు మృత్యువాత పడతాయి.
నీరు కాలుష్యం, అంటురోగాలు, తాగు నీరు కలుషితమవుతుంది. తాగడానికి మంచి నీరు లభించదు. కలుషిత నీరు తాగడం వల్ల కలరా, డైయేరియా లాంటి అంటువ్యాధులు ప్రబలుతాయి.ఆర్థిక వ్యవస్థ స్తంభిస్తుంది, ప్రజలు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళడం వల్ల ఆర్థిక వ్యవస్థ స్తంభిస్తుంది. భూసారం తగ్గుతుందినేలమేటతో క్రమక్షయానికి గురై సారవంతం తగ్గుతుంది. అధిక వరదల వల్ల రోడ్లు వంతెనలు, రైల్వేట్రాక్కులు దెబ్బతిని ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారు. విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థ దెబ్బతింటుంది. పురాతన భవనాలు దెబ్బతింటాయి, కూలిపోతాయి. అటవీ ప్రాంతం లో వరదల వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. మహా నగరాల్లో పల్లపు ప్రాంతాలు జలమయమవుతాయి. ఆకస్మిక వరదల ఉధృతి వల్ల కొంత మంది మరణిస్తున్నారు, తీర ప్రాంతంలో చేపలు పట్టేవారు మృత్యువాతపడతారు.
నదుల ఎగువ ప్రాంతాల్లో అడవులు పెంచాలి. వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి వరదలు రాకుండాచర్యలు తీసుకోవాలి. పోడు వ్యవసాయాన్ని తగ్గించాలి. నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి. వరద నీటిని కాలువల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించాలి. వరదముంపుకు గురైన ప్రాంతాలలో ప్రాజెక్టులు నిర్మించాలి.రిజర్వాయర్లు నెలకొల్పాలి. పట్టణాలలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. వరదలకు సంబంధించిన సమాచారం, వరదల ముప్పును ముందుగానే మీడియా ద్వారా ప్రజలకు ప్రభుత్వం తెలియచేయాలి. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. లోతట్టు ప్రాంత ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలించాలి. వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. శాశ్వత ప్రాతిపదికన వరద నివారణ, నిర్వహణ పాలన వ్యవస్థలో ప్రభుత్వ యంత్రాంగం క్రియాశీలకంగా పని చేయాలి. నగరాలలో మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. చెక్ డాములు, చెరువులు, కుంటలు, బావులు, నీటిగుంతలు ఏర్పాటు చేయాలి. కాంటూర్ కందకాలు ఏర్పాటు చేసి నీటిని నియంత్రించాలి. వరద నివారణ, నియంత్రణ నిర్వహణలో పౌర సమాజానికి భాగస్వామ్యం కలిగించాలి.
స్వాతంత్య్ర వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వరదల నివారణ కోసం 10వ ప్రణాళిక కాలంలో వరదలు వచ్చే అవకాశమున్న 45.6 మిలియను హెక్టార్ల విస్తీర్ణంలో రక్షణ చర్యలు చేపట్టారు. 11వ ప్రణాళికలో 2.18 మిలియన్ల హెక్టార్లలో అదనంగా రక్షణ చర్యలు చేపట్టారు. 1954లో నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రాం ప్రారంభించిన తర్వాత వరద నివారణ చర్యలు వేగవంతమైనాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ వరదల గురించి ముందస్తు సమాచారాన్ని అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వరదల సమయంలో తగిన చర్యలు చేపట్టడానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) కు చెందిన బెటాలియన్లకు తగిన శిక్షణ ఆధునాతన పరికరాలను సమకూర్చుతుంది. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం హెచ్చరికలు ప్రకటనలు జారీ చేయడం, ఆహారం, ఔషధాలు సమకూర్చడం ప్రభుత్వం చేపడుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఐఎండి భారత దేశంలో 62 నదీ పరీవాహక ప్రాంతాల్లో 945 ప్రదేశాల నుండి వాతావరణం సమాచారాన్ని సేకరిస్తూ తగు జాగ్రత్తలు, అవగాహన, చైతన్య ము కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నారు. సామాన్య ప్రజలకు వరదలకు సంబంధించిన జాగ్రత్తలు గురించి, చైతన్యవంతం చేసే వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామ స్థాయి నుంచి అన్ని వర్గాలకు శిక్షణ ఇవ్వాలి. వివిధ సంస్థలు, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థులను, వరదల నివారణ, నిర్వహణ పద్ధతుల మీద అవగాహన చైతన్య సదస్సులు ప్రభుత్వం నిర్వహించాలి. ప్రకృతి విపత్తులు, పర్యావరణ పరిరక్షణ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. ప్రభుత్వం జల వనరుల సమగ్ర అభివృద్ధితో మానవ వనరుల వికాసానికి శీఘ్రతర ఆర్థికాభివృద్ధికి వ్యూహాలను అమలు వెయ్యాలి.
– నేదునూరి కనకయ్య, ఫోన్: 9440245771.