ఇది ఎలా జరిగిందో గత యుపిఎ ప్రభుత్వం చెప్పాలి
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : ఇస్రోకు చెందిన కమర్షియల్ వింగ్ యాంట్రిక్స్‌దేవాస్ మల్టిమీడియా మధ్య వివాదాస్పద ఒప్పందం కేసుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. ఈ డీల్ దేశానికి వ్యతిరేకంగా మోసమని, ఇది ఎలా జరిగిందో గత యుపిఎ ప్రభుత్వం వివరించాలని అన్నారు. దశాబ్దం క్రితం నాటి ఈ వివాదాస్పద ఒప్పందం రద్దును సుప్రీం కోర్టు సమర్థిస్తూ ఇచ్చిన తీర్పుపై మంత్రి స్పందిస్తూ, కోర్టు సమగ్ర ఉత్తర్వులిచ్చిందని అన్నారు. 2011లో యుపిఎ రద్దు చేసిన ఈ డీల్ మోసపూరితమైందని ఆమె అన్నారు. ఈ ఒప్పందం దేశ భద్రతకు విరుద్ధం, శాటిలైట్ లేదా స్పెక్ట్రమ్ బ్యాండ్‌లను ప్రైవేట్ పార్టీలకు విక్రయించడం, ప్రైవేట్ పార్టీల నుండి డబ్బు సంపాదించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేకత అని మంత్రి విమర్శించారు. దేవాస్ మల్టిమీడియాను రద్దు చేస్తూ 2021 సెప్టెంబర్ 8న ఎన్‌సిఎల్‌ఎటి ఇచ్చిన ఆదేశాలను దేవాస్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అయితే 2022 జనవరి 17న (సోమవారం) సుప్రీం కోర్టు దేవాస్ దాఖలు చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చింది.
2005లో ఒప్పందం
2005 సంవత్సరంలో యాంట్రిక్స్ కార్పొరేషన్, ఇస్పో(ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) వాణిజ్య శాఖ అయిన దేవాస్ మల్టీమీడియా మధ్య ఒక ఒప్పందం జరిగింది. శాటిలైట్ సేవల కోసం ఈ ఒప్పందం జరిగింది. దీని కింద ఎస్-బ్యాండ్ శాటిలైట్ స్పెక్ట్రమ్‌ని ఉపయోగించే మొబైల్ వినియోగదారులకు మల్టీమీడియా సేవలు అందించాలి. దేవాస్ ప్రకారం, ఈ ఒప్పందం లక్ష్యం అద్భుతమైన ఆవిష్కరణ, దీంతో దేవాస్ మునుపెన్నడూ లేని సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టగా, యాంట్రిక్స్‌కు భారీ ఆదాయాన్ని అందిస్తుంది.
డీల్ రద్దు చేసిన ఎన్‌సిఎల్‌ఎటి
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి) బెంగళూరు బెంచ్ ఈ అంశాన్ని విచారించింది. యాంట్రిక్స్ కార్పొరేషన్‌లోని అప్పటి అధికారులతో కలిసి దేవాస్‌ను మోసపూరిత పద్ధతిలో సృష్టించారని ఆరోపించారు. ఈ కారణంగా ఎన్‌సిఎల్‌టి దేవాస్ మల్టీమీడియాను కూడా రద్దు చేయాలని ఆదేశించింది. ఎన్‌సిఎల్‌ఎటి ప్రకారం, బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ వేలం మోసపూరితమైనది, జాతీయ భద్రత, ఇతర సామాజిక ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి శాటిలైట్ స్పెక్ట్రమ్ అవసరమవుతుంది. ఈ ఉత్తర్వును దేవాస్ మల్టీమీడియా ఎన్‌సిఎల్‌ఎటి చెన్నై బెంచ్ ముందు సవాలు చేయగా, ఈ కోర్టు కూడా పిటిషన్‌ను కొట్టివేసింది. దీని తర్వాత విషయం సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ దేవాస్ మల్టీమీడియా పిటిషన్‌ను జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ వి రామసుబ్రమణ్యం కొట్టివేశారు.