Monday, December 23, 2024

అంత్యోదయ నమూనా ఇచ్చిన దీనదయాళ్

- Advertisement -
- Advertisement -

Antyodaya model given by Deenadayal

గత కొంత కాలంగా ప్రపంచంలోని భౌగోళిక -రాజకీయ పరిస్థితులలో విశేషమైన మార్పులు సంభవిస్తున్నాయి. అనేక సంబంధం లేని సంఘటనలు మార్పుకు నేపథ్యాన్ని అందిస్తున్నాయి. యుగోస్లేవియా, సిరియా, అస్ఘానిస్తాన్, శ్రీలంక వంటి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సంఘటనలు, రష్యా -ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం, ప్రస్తుత ప్రపంచ క్రమం స్థిరమైన శాంతి, శ్రేయస్సును అందించే ఫ్రేమ్ వర్క్‌ను అందించలేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచం ప్రచ్ఛన్న యుద్ధ యుగం బయటపడినా, సంఘర్షణ, ఘర్షణ వాతావరణం తగ్గిపోతుందని, ఐరోపా అనుసరించిన పాశ్చాత్య రాజకీయ, అభివృద్ధి నమూనా, అమెరికా నేతృత్వంలో అవసరమైన నాయకత్వం, దిశను అందజేస్తుందని వేసుకున్న అంచనాలు తలకిందులు అవుతున్నాయి. ప్రస్తుత శక్తి సమీకరణాలను కొత్త శక్తి డైనమిక్స్‌తో భర్తీ చేయడం అనివార్యంగా స్పష్టం అవుతున్నది.

నేడు పాశ్చాత్య ప్రపంచం అనుసరిస్తూ వచ్చిన దోపిడీ, అధికార స్వభావాన్ని కొనసాగించటమా లేదా మరో విలక్షణమైన నమూనాను అనుసరించడమా అన్నదే ప్రపంచం ముందున్న ప్రధాన సవాల్ గా చెప్పవచ్చు. ఈ సందర్భంగా ప్రపంచం ముందు విలక్షణమైన నమూనాగా భారతీయ ఆలోచనలు నిలబడే పరిస్థితులు నెలకొంటున్నాయి. విభిన్నమైన, సంపూర్ణమైన సైద్ధాంతిక భావనల ఆధారంగా పూర్తిగా కొత్త ప్రపంచ క్రమం అందుకు దారితీసే అవకాశం కూడా కనిపిస్తున్నది. ప్రకృతి దోపిడీని మానవుల జన్మహక్కుగా పరిగణించని, దానితో సామరస్యంగా జీవించడాన్ని విశ్వసించే భారతీయ సనాతన ఆలోచనల ఆవశ్యకతను నేడు ప్రపంచం గుర్తిస్తున్నది. మనకు ప్రకృతిలో సమగ్రమైన, మానవతావాద స్వభావం కలిగిన ఒక క్రమం అవసరం. ఆ దిశలో స్వతంత్ర భారత దేశంలో ఓ ప్రత్యామ్నాయ సైద్ధాంతిక ఆలోచనను ప్రజల ముందుంచిన దివంగత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం మన ముందుకు వస్తున్నది.

మొత్తం ప్రపంచం పెట్టుబడిదారీ విధానం, సామ్యవాద విధానంల మధ్య పరిమితం అవుతున్న సమయంలో సనాతన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జ్ఞానం, వ్యవస్థల నుండి సరికొత్త ఆలోచనను పండిట్ దీన్ దయాళ్ మన ముందుంచారు. ఆ రెండింటి ప్రాతిపదిక ఒక్కటే అని పేర్కొంటూ, వాటికి భిన్నంగా సాధారణ ప్రజలు కేంద్రంగా విధానాలు రూపొందించాలని అంత్యోదయ అభివృద్ధి నమూనాను ఆయన ప్రతిపాదించారు. చిట్టచివరి వ్యక్తి సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యం కావాలనే సరికొత్త ఆలోచనను మన ముందుంచారు. కేవలం భారత దేశం సమగ్రాభివృద్ధి చెందడం కోసమే కాకుండా, మొత్తం విశ్వ మానవాళి సంతోషంగా జీవించడం కోసం ప్రాతిపదికగా ఈ విధానాన్ని ప్రతిపాదించారు. నేడు మన దేశంలో దాదాపు అన్ని ప్రభుత్వాలు తమ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ఆలోచనే ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్నదని చెప్పవచ్చు.

ప్రత్యామ్నాయ సామాజిక, రాజకీయ, ఆర్ధిక విధానంగా భారతీయ జనసంఘ్ అధ్యక్షునిగా ఆయన 1960వ దశకం చివరిలో ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం ఆధునిక భారతదేశానికి అత్యంత అనుసరణీయంగా నెలకొన్నదని చెప్పవచ్చు. నేడు మన దేశం ఎదుర్కొంటున్న భిన్నమైన, సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలను అందించడానికి మాత్రమే కాకుండా, స్థిరమైన, సమ్మిళిత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి సహితం ఆచరణ యోగ్యంగా నెలకొంది. పాశ్చాత్య నమూనాలను గుడ్డిగా అనుసరిస్తూ వస్తున్న భారత దేశం ముందు విలక్షణమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక నిర్వహణ కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఇది అందిస్తుంది. సమగ్ర మానవతావాదాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు చరిత్రలో భారత దేశం కేవలం సాంస్కృతికంగానో, ఆధ్యాత్మికంగానో మాత్రమే కాకుం డా ఆర్ధికంగా కూడా బలమైన వ్యవస్థగా గుర్తింపు పొందిన విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.

‘ది వరల్డ్ ఎకానమీ ఎ మిలీనియల్ పెర్స్పెక్టివ్’ పేరుతో ప్రసిద్ధి పొందిన ఆర్థిక చరిత్రకారులలో ఒకరైన అంగస్ మ్యాడిషన్, 18వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రపంచ జిడిపిలో భారతదేశం వాటా 24.5 శాతంగా ఉందని పేర్కొనడం గమనార్హం. ఆ కాలంలో అనుసరిస్తున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక నమూనాలు గొప్ప ప్రమాణాలతో ఉంటేనే ఇది సాధ్యమయ్యేది. క్రీ.పూ. 3వ శతాబ్దంలో కౌటిల్యుడు తన అర్థశాస్త్రాన్ని ప్రతిపాదించాడు, ఇది రాజ్యాధికారానికి సంబంధించిన దాదాపు అన్ని అంశాలకు సంబంధించిన వివరణాత్మక గ్రంథం. ఆడమ్ స్మిత్ పెట్టుబడిదారీ విధానానికి పూర్వగామి అయిన వెల్త్ ఆఫ్ నేషన్స్ రాయడానికి దాదాపు 2000 సంవత్సరాల ముందు ఇది జరిగింది. అనేక ఇతర పురాతన గ్రంథాలు ఉన్నాయి, ఇవి ప్రభుత్వాన్ని నడిపించే ఉత్తమ పద్ధతులు, సూత్రాలపై అమూల్యమైన జ్ఞానం, లోతయిన పరిజ్ఞానాన్ని అందిస్తాయి. దురదృష్టవశాత్తూ, వలసవాద ఆధీనంలో ఉన్న కాలంలో మనం వీటిని కోల్పోయాము.

వలసవాద పాలకులు ప్రధానంగా తమ ప్రయోజనాలను నెరవేర్చడానికి ఉద్దేశించిన విధానాలకు లొంగిపోయాము. స్వాతంత్య్రానంతరం, ఈ దేశ భవిష్యత్తు కోసం విధానాలు, వ్యూహాలను రూపొందించే అవకాశం వచ్చినా ఆ దిశలో చెప్పుకోదగిన ప్రయత్నాలు జరగలేదు. పండిట్ దీన్ దయాళ్ చెప్పినట్లుగా మనం గుడ్డిగా గతంలోకి వెళ్లి దానిని అనుసరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా విషయాలు కాలక్రమేణా మారుతాయి. అభివృద్ధి చేసిన ప్రతి దాన్ని మనం తిరస్కరించనవసరం లేదు. మన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాలు, పరిస్థితులు, గత జ్ఞానంపై ఆధారపడిన ఒక నమూనాను కలిగి ఉండాలి. కానీ దానితో విభేదించని ఇతర వ్యవస్థల ఉత్తమ అభ్యాసాలు, జ్ఞానంతో ఏకీకృతం కావాలని ఆయన సూచించారు. 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్‌లో మధురకు సమీపంలో ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించి, 8 వ ఏటనే తల్లిదండ్రులను కోల్పోయి, మేనమామ పెంపకంలో పెరిగిన ఆయన భారతీయ జనసంఘ్‌ను డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రారంభించినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ నుండి సహాయకులుగా వచ్చిన నలుగురైదుగురులలో ఒకరు.

కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయంగా నూతన రాజకీయ పార్టీని స్థాపించిన డా. ముఖర్జీ కొద్దికాలంలోనే మృతి చెందడంతో దానికి నిర్దిష్టమైన సైద్ధాంతిక భూమికను ఏర్పా టు చేయలేకపోయారు. బలరాజ్ మధోక్ జనసంఘ్‌కు రాజకీయ, ఆర్ధిక విధానాలు రూపొందించగలిగినా సంస్థాగతంగా దానికి ఒక స్వరూపం తీసుకురావడంతో పాటు, సైద్ధాంతిక భూమిక ఏర్పాటు చేసింది ఉపాధ్యాయ మాత్రమే. నేటి భారతీయ జనతా పార్టీ సహితం ఆ భూమిక నుండే స్ఫూర్తి పొందుతున్నది. అప్పటి వరకు పాలకులు కేవలం పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు పట్లనే దృష్టి సారించేవారు. ‘గరీబీ హటావో’ అంటూ ఇందిరా గాంధీ పేదల అభ్యున్నతి గురించి ప్రస్తావించడానికి చాలా ముందుగానే దీనదయాళ్ ‘అంత్యోదయ’ కల్పనను మన ముందుంచారు. అభివృద్ధి ఫలాలు మొదటగా అట్టడుగున ఉన్న వారికి చేరాలన్నదే ఆయన సంకల్పం. మధ్యప్రదేశ్‌లో వి కె సక్లేచ, రాజస్థాన్‌లో భైరంగసింగ్ షెకావత్, హిమాచల్‌ప్రదేశ్‌లో శాంత కుమార్ వంటి ప్రభుత్వాలు దేశంలో మొదటిసారిగా అంత్యోదయ అభివృద్ధి నమూనాను దీనదయాళ్ స్ఫూర్తితో అమలు ప్రారంభించారు. అయితే ఆ తర్వాత పేదల ఓట్లు రాబట్టే ప్రజాకర్షణ పథకాలుగా మారిపోవడంతో ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. రూ. 2 కు కిలో బియ్యం, శాశ్వత గృహ నిర్మాణం, పెన్షన్లు వంటివి అటువంటివే.

పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజం రెండింటి తిరస్కరిస్తూ ఆయన ఏకాత్మ మానవతావాదం అనే తాత్విక సిద్ధాంతాన్ని భారత రాజకీయాలకు ప్రత్యామ్నాయ సైద్ధాంతిక ప్రాతిపదికగా ప్రతిపాదించారు.1964లో ఆయన ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదంను మరుసటి సంవత్సరం జనవరి చివరిలో విజయవాడలో జరిగిన జనసంఘ్ మహాసభలు ఆమోదించాయి.ఏప్రిల్, 1965లో ముంబైలో నాలుగు ప్రసంగాలలో తన సైద్ధాంతిక భూమికకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. నాడు ప్రపంచ దేశాల ముందున్న వివిధ రాజకీయ విధానాలకు పూర్తిగా భిన్నమైన, విలక్షణమైన భారతీయ ప్రత్యామ్నాయంగా అపారమైన హేతుబద్ధమైన నేపథ్యాన్ని కల్పించారు.

ఆయన భవిష్యత్ అవకాశాలపై దృష్టి సారించి సమకాలీన సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రాచీన మూలాల ఆధారంగా ఆలోచనను ప్రతిపాదించారు. దీనదయాళ్ ప్రతిపాదించిన పరిపాలన, రాజకీయాల ప్రత్యామ్నాయ విధానాలు నేడు ప్రపంచంలో అనేక మంది ఆలోచనాపరుల దృష్టిని ఆకట్టుకొంటున్నాయి. అయితే తర్వాత కొద్ది కాలంకే అనుమానాస్పద పరిస్థితులలో 11 ఫిబ్రవరి 1968 న మొఘల్ సరాయ్ రైల్వే యార్డ్ వద్ద చనిపోవడంతో ఆయన ఆలోచనలకు నిర్దుష్టమైన కార్యప్రణాళికలను రూపొందించిన లేకపోయారు. నేటి బిజెపి పాలకులు ఆయన నుండే స్ఫూర్తి పొందుతున్నామని చెబుతున్నప్పటికీ ఆయన ప్రతిపాదించిన అంశాలకు, నేడు అమలు చేస్తున్న వాటికి మధ్య కీలకమైన ‘ఆత్మ’ అదృశ్యమైందని చెప్పవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News