కోల్ కతా: మమతకు అత్యంత సన్నిహితుడైన బీర్భూమ్ జిల్లా టిఎంసి అధ్యక్షుడు అనుబ్రతా మోండల్‌ను సిబిఐ అరెస్ట్ చేసింది. 2020 పశువుల అక్రమ రవాణా కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది. బీర్భూమ్ జిల్లాలోని తన నివాసంలో అనుబ్రతా మోండల్‌ను గురువారం సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో టిఎంసి కార్యకర్తలు, మోండల్ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరీ చెదరగొట్టి మోండల్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తమ ఎదుట హాజరుకావాలని 10 పర్యాయాలు సమన్లు పంపినా అనారోగ్య కారణాలతో ఆయన రాలేదని సిబిఐ వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా గతంలో రెండు సార్లు ఆయనను సిబిఐ అధికారులు ప్రశ్నించారు.
2020లో సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశువుల స్మగ్లింగ్ కుంభకోణం కేసులో అనుబ్రతా మోండల్ పేరు తెరపైకి వచ్చింది. సిబిఐ నివేదిక ప్రకారం.. 2015, 2017 మధ్య కాలంలో 20,000 పశువుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. దీంతో పశువుల అక్రమ రవాణా స్కామ్ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.