Thursday, January 23, 2025

నిజాలు చూడలేకపోతే నోరు మూసుకోండి: ఇజ్రాయెల్ దర్శకుడిపై ఆగ్రహం..

- Advertisement -
- Advertisement -

నిజాలు చూడలేకపోతే నోరు మూసుకోండి
‘కశ్మీర్ ఫైల్స్’ విమర్శకులపై అనుపమ్ ఖేర్, వివేక్ అగ్నిహోత్రి ఫైర్
క్షమాపణలు చెప్ని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్
ముంబయి: గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం(ఇఫి)లో ‘కశ్మీర్ ఫైల్స్’ చలనచిత్రంపై జ్యౌరీ హెడ్, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాసిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఈ సినిమా చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని, ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రమంటూ లాసిడ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సొంత దేశ దౌత్యవేత్తలు తీవ్రంగా ఖండిస్తూ భారత్‌కు క్షమాపణ చెప్పారు. తాజాగాఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సైతం ఇజ్రాయెల్ దర్శకుడి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు చూడలేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలంటూ అనుపమ్ ఖేర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై విమర్శలు చేస్తున్న వారినుద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రాంలో వీడియో విడుదల చేశారు.

‘కొందరికి నిజాలను ఉన్నది ఉన్నట్లుగా చూపించే అలవాటు ఉండదు.దాన్ని తమ ఇష్టం వచ్చినట్లు మార్చి చూపిస్తుంటారు. అలాంటి వారు కశ్మీర్ నిజాలను జీర్ణించుకోలేక పోతున్నారు. గత 25, 30ఏళ్లుగా కశ్మీర్‌ను వేరే కోణంలో చూపిస్తున్నారు. దాన్ని కశ్మీర్ ఫైల్స్ బహిర్గతం చేసింది.సినిమాలో నిజాలను చూపించడం వారికి రుచించట్లేదు.అందుకే సత్యాన్ని అపహాస్యం చేసేందుకు దొరికిన ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదు. మీరు వాస్తవాలను చూడలేకపోతే కళ్లు మూసుకోండి.. నోరు మూసుకోండి. ఎందుకంటే ఇదే మా కశ్మీర్‌లో జరిగిన నిజం. ఇది మా విషాద చరిత్రలో భాగం. మీకు అది తెలియకపోతే ఆ విషాదాన్ని అనుభవించిన వారిని కలిసి తెలుసుకోండి. భారత్, ఇజ్రాయెల్ రెండు దేశాలూ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. అందువల్ల కశ్మీరీ హిందువుల బాధను ఇజ్రాయెల్‌లోని సామాన్య వ్యక్తి కూడా అర్థం చేసుకోగలడు. అయితే ప్రతి దేశంలోనూ దేశద్రోహులుంటారు గదా’ అంటూ అనుపమ్ ఖేర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తమది మామూలు సినిమా కాదని, ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చే ఉద్యమం అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.ఈ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు టూల్‌కిట్ గ్యాంగులు ప్రయత్నిస్తూనే ఉంటాయన్నారు. అటుఈ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ‘ నిజం చాలా ప్రమాదకరమైంది. అది ప్రజలతో అబద్ధాలు చెప్పించగలదు’ అంటూ ట్వీట్ చేశారు.

అది లాపిడ్ వ్యక్తిగత అభిప్రాయమే: జ్యూరీ బోర్డు
ఈ నేపథ్యంలోనే ఇఫి జ్యూరీ బోర్డు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్ ఫైల్స్‌పై లాపిడ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగ్గత అభిప్రాయమేనని, జ్యూరీ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.‘ జ్యూరీ సభ్యులుగా ఒక సినిమా సాంకేతికత, నాణ్యత, సామాజికసాంస్కృతిక ఔన్నత్యాన్ని మాత్రమే మేము అంచనా వేస్తాం. అంతేగాని సినిమాలపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలూ చేయబోం. ఒక వేళ జ్యూరీ సభ్యులెవరైనా అలాంటి వ్యాఖ్యలు చేస్తే అది పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ అని జ్యూరీ బోర్డు ఆ ప్రకటనలో పేర్కొంది.

ఖేర్‌కు ఇజ్రాయెల్ దౌత్యవేత్త క్షమాపణ
మరోవైపు ఇజ్రాయెల్ దర్శకుడి వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపడంతో భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి నావోర్ గిలాన్ స్పందించారు. లాపిడ్ వ్యాఖ్యలను ఖండించిన ఆయన భారత ప్రభుత్వానికి క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా భారత్‌లో ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొప్పిడ్ షొషానీ కూడా లాపిడ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ విషయం తెలియగానే ఆయన అనుపమ్ ఖేర్‌కు స్వయంగా ఫోన్ చేసి క్షమాపణలు తెలియజేశారు.‘ లాపిడ్ వ్యాఖ్యలు పూర్తిగా ఆయనవ్యక్తిగతమే. దీనికి ఇజ్రాయెల్‌తో అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ విషయం తెలియగానే అనుపమ్ ఖేర్‌కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పా. కశ్మీర్‌ఫైల్స్ ప్రచార చిత్రం కాదు. కశ్మీరీల బాధలను చెప్పిన బలమైన చిత్రం’ అని షొషానీ చెప్పారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం లాపిడ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

Anupam Kher slams Israel Director over ‘Kashmir Files’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News