దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో దివంగత మాజీ కేంద్ర మంత్రివర్యులు సూదిని జైపాల్ రెడ్డి స్మారక గ్రంధాలయ భవనాన్ని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు,జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిమాట్లాడుతూ…. దేవరకొండ నియోజకవర్గ విద్యార్థుల భవిష్యత్ కోసం దివంగత నేత మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి జ్ఞాపకార్ధం గ్రంధాలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. జైపాల్ రెడ్డి పేరుమీద నిర్మించిన భవనాన్ని ఆయన సమకాలికులు అయిన కే. కేశవ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం ఆనందంగా ఉందన్నారు.
విద్యా ఉంటే ఎంతటి కష్టాలను అయిన జయించవచ్చని ఆయన పేర్కొన్నారు. మెరుగైన విద్యను అందించడంతోనే రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయగలం అనే సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. నాలేజ్డ్ ఉంటే గల్లీ నుండి ఢిల్లీ స్థాయికి ఎదగవచ్చని జైపాల్ రెడ్డి నిరూపించారని గుత్తా పేర్కొన్నారు. ఆయన చదువుకున్న కళాశాల ప్రాంగణంలో ఆయన జ్ఞాపకార్ధం గ్రంధాలయాన్ని నిర్మించడం గొప్ప విషయమన్నారు. నేటి యువత ఆదర్శనేతలను ఆదర్శంగా తీసుకుని వారు ఎంచుకున్న రంగాల్లో విజయాన్ని సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచుతాం శ్రీధర్, నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి ,దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహా,దేవరకొండ ఎంపీపీ జానీ యాదవ్,పి.ఏ పల్లి ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్,సూదిని జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు, దేవరకొండ నియోజకవర్గ టిఆర్ఎస్ నేతలు,తదితరులు పాల్గొన్నారు.