Wednesday, July 3, 2024

ఈ తీర్పు చారిత్రాత్మకం

- Advertisement -
- Advertisement -

ఓటుకు ఉన్న శక్తి ఏపాటిదో ఈ ఎన్నికల్లో వెలువడిన తీర్పు ద్వారా మరొకసారి విశదమైంది. ఎత్తులు పైయెత్తులు వేయడంలో రాజకీయ నాయకులను మించినవారు లేరంటారు. కానీ తల ఎగరేసే నేతల తల ఎలా వంచాలో, ఎవరిని, ఎప్పుడు అధికారపీఠంపై నుంచి ఎలా దించాలో ఓటరుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ఈ ఎన్నికలు మరొకసారి నిరూపించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఓటరు మహాశయుడు వివేచనతో, విచక్షణతో, వివేకంతో ఓటు వేసిన ఎన్నికలు ఇవి. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ నినాదంతో ఎన్నికల గోదాలోకి దిగిన బిజెపి 300 సీట్లు కూడా దాటలేకపోయిందన్నా, ఆంధ్రప్రదేశ్‌లో ‘వై నాట్ 175’ అంటూ తొడగొట్టిన వైసిపి 10 సీట్లకే పరిమితమైందన్నా అందుకు స్వయంకృతాపరాధాలే కారణం.

హడావిడిగా అయోధ్య రామాలయాన్ని నిర్మించి, రాముడి పేరిట ఓట్లు కొల్లగొట్టాలనుకున్న బిజెపి ఎత్తుగడలు చిత్తయ్యాయి.గత ఎన్నికల్లో 353 సీట్లు గెలుచుకున్న ఎన్‌డిఎ ఈసారి 300 సీట్లు కూడా గెలవలేకపోవడం గమనార్హం. అత్యధిక లోక్‌సభ సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్‌లోనూ ఎన్‌డిఎ కూటమి వెనుకంజ వేయడం ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతోంది. ఎన్నికల ఆరంభంలో తలోదారిలో పయనించిన ‘ఇండియా’ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు నాలుగోదశ పోలింగ్ నాటికి ఒక్కతాటిపైకి వచ్చాయి. దాని ఫలితమే ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలో మెజారిటీ సీట్లు సంపాదించుకోవడానికి కారణమని చెప్పుకోవచ్చు. ఎన్‌డిఎ తో పోలిస్తే ‘ఇండియా’ కూటమి సీట్ల సంఖ్యలో వెనుకబడినా, 2019 ఎన్నికల్లో గెలుచుకున్న 93 సీట్లతో పోలిస్తే, ఈసారి భారీ స్థాయిలో పుంజుకున్నదన్న సంగతి అర్థమవుతోంది. ఇక పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

తలపండిన రాజకీయ విశ్లేషకులకు సైతం కొరుకుడు పడని ఎన్నికలుగా కనిపించిన ఆంధ్రప్రదేశ్‌లో ఫలితం ఏకపక్షంగా తేలిపోయిందంటే, ఓటరు ఎంత విజ్ఞతతో ఓటు వేశాడో ఆలోచించుకోవచ్చు. అభివృద్ధి, సంక్షేమం బండికి జోడెడ్లలాంటివనీ, ఏ ఒక్కటి లోపించినా సహించబోమనే విషయాన్ని ఓట్ల రూపంలో ప్రజలు విస్పష్టంగా చెప్పారు. సంక్షేమం ముసుగులో అభివృద్ధిని విస్మరించి నగదును పంచిపెట్టడమే ఘన కార్యంగా భావించి, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడిన వైసిపికి జనం చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఎంతటి ఘన విజయం సాధించిందో, అంతకుమించిన పరాజయ పరాభవాన్ని ఈ ఎన్నికల్లో మూటగట్టుకుంది. తనకు పెట్టనికోటలా ఉన్న రాయలసీమతోపాటు అనేక జిల్లాల్లో పార్టీ అడ్రస్ లేకుండా పోయిందంటే ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి మధ్య ఓట్ల బదలీ నూటికి నూరు శాతం జరిగినట్లు తాజా ఫలితాలు చెబుతున్నాయి.

కూటమి ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్న పవన్ కల్యాణ్‌ను ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా అభివర్ణించవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కాలూనేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న బిజెపికి ఈ ఎన్నికలు కలసి వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు దీటుగా బిజెపి సైతం సీట్లను గెలుచుకోవడం, ఏడు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండంకెల సంఖ్యను దాటకపోవడం గమనించవలసిన పరిణామాలు. రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఆయా కాలమాన పరిస్థితులను బట్టి నేతల గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు.

ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టే వ్యూహంతో పావులు కదిపే బిజెపికి ఇప్పుడు అవే ప్రాంతీయ పార్టీలపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన ఎన్‌డిఎకు, మ్యాజిక్ ఫిగర్ కు కొన్ని సీట్ల తేడాతో వెనుకబడిన ‘ఇండియా’ కూటమికి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలే దిక్కు. ఒకప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన చంద్రబాబు మళ్లీ కేంద్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఏ పార్టీ అధికార పీఠం అధిష్ఠించినా, అభివృద్ధికి పీట వేస్తేనే పది కాలాల పాటు పదవిలో ఉంటారనేది చరిత్ర నేర్పిన పాఠం. హద్దులు మీరి ప్రవర్తించిన ఏ పార్టీనీ ప్రజలు క్షమించరనే నగ్నసత్యం ఈ ఎన్నికల్లో మరొకసారి రుజువైంది. అధికార, విపక్ష పార్టీలు తమతమ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ ప్రజల మన్ననలను చూరగొంటే వారి రాజకీయ భవితకు డోకా ఉండదనడంలో సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News