అమరావతి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేసిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేశామన్నారు. ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. జగన్ ప్రభుత్వంలో పేదరికం 11.25 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు చేపట్టామని, పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని, మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చామాని స్పష్టం చేశారు.
విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు చేశామని, జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకు రూ.3367 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అములు చేస్తున్నామని, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని, ఇప్పటివరకు గోరుముద్దకు రూ.4417 కోట్లు ఖర్చు చేశామని, జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ.1910 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. విద్యా సంస్కరణల్లో డిజిటల్ లెర్నింగ్ కీలకంగా మారిందని గవర్నర్ ప్రశంసించారు.
విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నామని, అత్యున్నత 50 విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాకల్టీలలో ఏ విభాగంలోనైనా విదేశీ విద్యను అభ్యసించవచ్చని, ఇందు కోసం రూ.1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్ చేస్తున్నామన్నారు.8,9 తరగతుల విద్యార్థులకు 9,52,925 ట్యాబ్‌లు పంపిణీ చేశామని, వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి ఐబి విధానం ప్రవేశ పెడుతున్నామని, పతి సంవత్సరం ఒక తరగతికి ఐబి విధానం పెంచుకుంటూ వెళ్తామని, మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విద్యా భోదన ఉంటుందన్నారు. ప్రభుత్వ కృషితో స్కూళ్లలో డ్రాపౌట్‌లు గణనీయంగా తగ్గాయని గవర్నర్ వివరణ ఇచ్చారు.