Sunday, November 17, 2024

కృష్ణా జలాలపై ఏపి జులూం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జులూం ప్రదర్శిస్తోంది. తనకు కేటాయించిన కోటా నీటికంటే ఇప్పటికే అధికంగా నదీజలాలను ఉపయోగించుకున్న ఏపి ప్రభుత్వం ఇకనైనా నీటి వాడకాన్ని నిలిపివేయాలని సూచించినా లేక్కపెట్టడం లేదు.నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా సాగర్ కుడికాల్వకు నీటి విడుదలను నిలిపివేయాలని నాలుగు రోజుల కిందటే తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు సూచించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఏపి అధికారులు కుడికాల్వకు దౌర్జన్యంగా నీటివిడుదలను కొనసాగిస్తున్నారు. ఏపికి ఇంకా 50టీఎంసీల మేరకు నీటి అవసరాలు ఉన్నాయని, నీటి విడుదలను ఆపే ప్రసక్తే లేదని ఏపి జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్ర అధికారులు తేల్చిచెప్పారు. మరో వైపు తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఆయకట్టుకు సాగర్ ఎడమకాల్వదారా నీటి ప్రవాహం సన్నగిల్లుతోంది. పంటలు చివరి దశకు వచ్చాయని ,కీలక సమయంలో ఆయకట్టు చివరి భూములకు సాగునీటికోసం కటకటలాడాల్సివస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలంలో ఆగని విద్యుత్ ఉత్పత్తి:
కృష్ణానదికి ఎగువ నుంచి నీటిప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులో నిలువ ఉన్న కొద్దిపాటి నీటిని కూడా విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగవకు తోడేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో గరిష్టస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా , పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 215టిఎంసీలు . శనివారం నాటికి ఈ జలాశయంలో నీటిమట్టం 819.70అడుగుల స్థాయికి పడిపోయింది. జలాశయంలో నీటినిలువ 40.63టిఎంసీలకు తరిగిపోయింది. ప్రాజెక్టులో మినిమం డ్రా డౌన్ లెవెల్ (ఎండిడిఎల్) 834అడుగులు ఉండాలని , అంతకంటే దిగువన ఉన్న నీటిని సాగునీటి అవసరాలకు వినియోగించుకోరాదని, విద్యుత్ ఉత్పత్తికి అసలే వినియోగించరాదని కృష్ణానదీయాజమాన్య బోర్డు రెండు తెలుగు రా్రష్ట్రాలకు గత నెల రెండవ వారంలోనే స్పష్టం చేసింది.

అయినప్పటికీ జన్కొ సంస్థలు జలవిద్యుత్ ఉత్పత్తిని ఎక్కడా నిలిపివేసిన దాఖలలాలు లేవు.ఏపి జన్కో ఇప్పటివరకూ జలవిద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం నుంచి 258టిఎంసీలకు పైగానే నీటిని దిగువకు వదిలింది. జనవరి ప్రారంభం నుంచి ఇప్పటికే 28టిఎంసీలకుపైగానే జలవిద్యుత్ ఉత్పతికోసం శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నిలువ నీటిని దిగువకు వదిలాయి. ఇందులో ఏపి జన్కో 16టిఎంసీల మేరకు వాడుకోగా, తెలంగాణ జన్కో 12టిఎంసీలమేరకు వినియోగించుకుంది. శనివారం కూడా శ్రీశైలం జలాశయం నుంచి జల విద్యుత్ కేంద్రాల ద్వారా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా , కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తం 8545 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
రేపు కృష్ణాబోర్డులో లెక్కతేలుతుందా:
కృష్ణానదీపరివాహక ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల వేసవి తాగునీటి అవసరాలకు సంబంధించి చర్చించేందుకు సోమవారం కృష్ణానదీయాజమాన్యబోర్డు త్రిసభ్య కమిటి సమావేశం జరగనుంది. హైదరాబాద్ జలసౌధలో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ, ఏపి నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొననున్నారు. గత నెల 17న త్రిసభ్య కమిటి సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఏపి అధికారులు హాజరు కాలేదు. ఆ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు కృష్ణా నదీజలాల లెక్కలు తేల్చాలని బోర్డును డిమాండ్ చేశారు. ఆ తరువాత నాలుగు రోజుల కిందట కూడా ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. కృష్ణానదీజలాలకు సంబంధించి 971టిఎంసీలలో ఏపి ప్రభుత్వం ఫిబ్రవరి చివరినాటికే 673టిఎంసీల నీటిని వాడుకుందని, ఇది మొత్తం నీటివాటాలో 74శాతం అని బోర్డుకు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం తన వంతుగా 221టిఎంసీలను వాడుకుందని ఇది 25శాతంగా తెలిపారు. ఏపి తన వాటానీటికి మించి 32టిఎంసీలకు పైగా నీటిని అధికంగా వాడుకుందని లేఖ ద్వారా బోర్డు దృష్టికి తీసుకుపోయారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాగా ఇంకా 108టిఎంసీల నీరు రావాల్సివుందని తెలిపారు. ఒక వైపు యదేశ్చగా జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఏపి తన వాటాకుమించి నీటిని వినిగించుకోవటమే కాకుండా సాగర్ కుడికాలువకు నీటివిడుదలలో జులూం ప్రదర్శిస్తోంది. ఈ పరిస్థితుల్లో కృష్ణాబోర్డు త్రిసభ్యకమిటీ సమావేశంలో నీటిలెక్కలు తేల్చి ఏపి దౌర్జన్యాలకు తెరవేస్తారా అన్న దిశగా తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News