తెలంగాణ ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ నో
7.64 ఎకరాల పటౌడి హౌస్ తీసుకోవాలంటూ సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఎపి భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ మరోమారు తెలంగాణకు అన్యాయం చేసింది. గత నెల 26వ తేదీన ఇరురాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ జరిపిన భేటీలో ఇరు రాష్ట్రాల చేసిన ప్రతిపాదనల్లో తెలంగాణ అధికారులు సూచించిన విధంగా కాకుండా ఎపికే అధిక ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను రెండు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోంశాఖ గురువారం పంపింది. గత నెల జరిగిన ఇరురాష్ట్రాల అధికారుల భేటీలో భూములు, భవనాల విభజనపై ఎపి 3 ప్రతిపాదనలు చేయగా, ఆస్తుల విభజనపై తెలంగాణ మరో ప్రతిపాదన చేసింది.
గోదావరి, శబరి బ్లాకులు తమకు ఇవ్వాలని దీంతోపాటు నర్సింగ్ హాస్టల్, పక్కనే ఉన్న ఖాళీ స్థలం ఇవ్వాలని తెలంగాణ కేంద్ర హోంశాఖకు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రతిపాదనకు కేంద్రం పూర్తి భిన్నంగా వ్యవహారించింది. 7.64 ఎకరాల పటౌడీ హౌస్‌ను తెలంగాణ తీసుకోవాలని కేంద్రం తేల్చింది. ఇక మిగిలిన 12.09 ఎకరాల ఖాళీ భూమి ఎపి తీసుకోవాని, గోదావరి, శబరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్‌ను సైతం ఎపి తీసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతోపాటు ఆస్తులను 58:42 నిష్పత్తితో ఎపి, తెలంగాణలు పంచుకోవాలని కేంద్రం పేర్కొంది. ఎపికి అదనపు భూమి దక్కితే తెలంగాణకు ఇచ్చేయాలని కేంద్రం సూచించింది.