అమరావతి: ఎపి అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359 కోట్లు ప్రవేశ పెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, రెవెన్యూ ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు, మూల ధన వ్యయం రూ.40,635 కోట్లు, అమరావతి నిర్మాణం కోసం రూ.6,000 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.4,220 కోట్లుగా అంచనా వేశారు.
ఈ సందర్భంగా శాసన సభలో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ…సామాన్యుల సంతోషమే.. రాజు సంతోషమని కౌటిల్యుడు చెప్పిన మాటలు గుర్తు చేశారు. 2024 నుంచి ఆర్థిక వ్యవహారాలను గాడిలో పెడుతున్నాం అని అన్నారు.
రూ.23,500 కోట్ల బకాయిలను చెల్లించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రూ.2,790 కోట్లను మున్సిపాలిటీలకు చెల్లించామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఎపి ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారన్నారని కొనియాడారు. వైసిపి పాలనలో ఆర్థిక అరాచకం జరిగిందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు. శ్వేతపత్రాల ద్వారా ఆర్థిక పరిస్థితిని ప్రజలకు తెలియజేశామన్నారు. ‘‘ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేదు’’ అని దుయ్యబట్టారు.
శాఖ కేటాయింపులు:
మత్స్యకార భరోసా కోసం రూ.450 కోట్లు.
బాల సంజీవని ప్లస్ కోసం రూ.1,163 కోట్లు.
హంద్రీనీవా, ఉత్తరాంధ్ర సృజన స్రవంతి, గోదావరి డెల్టా, కృష్ణ డెల్టా ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు.
అన్నదాత సుఖీభవ కోసం రూ. 6,300 కోట్లు.
ఎస్సి, ఎస్టిలకు ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు.
ఎస్సి ఎస్టి, బిసి వర్గాలకు స్కాలర్‌షిప్పుల కోసం రూ.337 కోట్లు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.6,705 కోట్లు.
జల్‌జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు.
స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు.
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం రూ. 500 కోట్లు కేటాయింపు.
ధరల స్థీకరణ నిధి కోసం రూ. 300 కోట్లు.
ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు రూ. 62 కోట్లు.
పాఠశాల విద్యాశాఖకు రూ. 31,806 కోట్లు.
బిసి సంక్షేమం కోసం రూ.23,260 కోట్లు.
వైద్యరోగ్య శాఖకు రూ.19,265 కోట్లు.
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి రూ.18,848 కోట్లు.
జలవనరుల శాఖకు రూ.18,020 కోట్లు.
పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు.
ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు.
సంక్షేమానికి రూ. 10,909 కోట్లు.
ఆర్థికంగా వెనుకబడినవారి సంక్షేమానికి రూ. 10,619 కోట్లు.
రవాణా శాఖకు రూ.8,785 కోట్లు కేటాయింపు.