అమరావతి భూముల క్రమవిక్రయాల్లో ఇన్‌సైడర్ ఆరోపణలపై
విచారణకు 23వ తేదీ ఉ.11గం.కు హాజరుకావాలని ఆదేశాలు
హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి నోటీసులు అందజేసిన
సిఐడి అధికారులు, బాబు బంధువులు కొందరికి కూడా..
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి భూముల క్రయవిక్రాయల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేటింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు సిఐడి అధికారులు మంగళవారం 41 సిఆర్‌పిసి కింద నోటీసులిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన సిఐడి అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు మాజీ సిఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 166, 167, 217, 120-బి, ఐపిసి రెడ్ విత్ 34, 35, 36, 37 సెక్షన్లు, ఎస్‌సి, ఎస్‌టి, ఏపీ ఎసైన్డ్డ్ భూముల చట్టం కింద ఈనెల 12న కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు. ఇదిలావుండగా టిడిపి ప్రభుత్వం త మకు పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకుందని, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలోని కొందరు రైతులు తన దృష్టికి తెచ్చినట్లు ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24న ఫిర్యాదు చేశారని అధికారులు వివరించారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జివొ వల్ల ఎస్సీ, ఎస్టీలకు నష్టం జరిగే అవకాశముందని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో కోరారు. దీనిపై విజయవాడ సిఐడి రీజినల్ అధికారి సూర్య భాస్కర్‌తో ప్రాథమిక విచారణ జరిపించారు. సంబంధిత అంశాలపై తప్పులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సూర్యభాస్కర్ నివేదిక ఇచ్చినట్లు సిఐడి డిఎస్‌పి స్పష్టం చేశారు. ఎఫ్‌ఐఆర్ కాపీని గుంటూరులోని ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు సమర్పించినట్లు తెలిపారు. సిఐడి సైబర్ క్రైమ్ డిఎస్‌పి లక్ష్మీనారాయణను కేసు విచారణాధికారిగా నియమించారు. ఎఫ్‌ఐఆర్ ఆధారంగా చంద్రబాబుతోపాటు అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణను విచారించాలని సిఐడి అధికారులు ఆయనకు సైతం నోటీసులిచ్చారు.
బాబు బంధు..బలగాలకూ నోటీసులు ః
చంద్రబాబుతో పాటు మరికొంతమంది అతని బంధువులతో పాటు టిడిపి కీలక నేతలను సిఐడి నోటీసులు జారీ చేయనుంది. ఈక్రమంలో చంద్రబాబుపై మూడు రోజుల క్రితమే120బి, 166, 167, 217 సెక్షన్ల కేసులు నమోదు చేశారు. ఇదిలావుండగా రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయని వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి నుంచి ఆరోపిస్తోంది. రాజధాని ప్రకటనకు ముందుగానే చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు, వారి బంధువులు అమరావతి ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తోంది. ఈ క్రమంలో సిఐడి విచారణకు ఆదేశించింది.దీనిపై దర్యాప్తు ప్రారంభించిన సిఐడి చంద్రబాబుతో పాటు పలువురు నేతలకు నోటీసులు జారీ చేయనున్నారు. ప్రస్తుతానికి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలను విచారణకు హాజరుకావాల్సిందిగా సిఐడి తన నోటీసుల్లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించాలని 2014లో అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రకటించింది.ఐతే రాజధాని ప్రకటనను ముందుగానే లీక్ చేయడం ద్వారా అక్కడ వేలాది ఎకరాలను ముందుగానే కొనుగోలు చేసిన అప్పటి మంత్రులు, టిడిపి నేతలు భారీగా లబ్ధిపొందారని, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సిఐడి విచారణకు ఆదేశించడం చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
న్యాయ నిపుణులతో బాబు భేటి
సిఐడి నోటీసులపైతన అత్యంత సన్నిహితులతో పాటు న్యాయనిపుణులను ఇంటికి పిలిపించుకుని భేటీ నిర్వహించారు. అసలు సీఐడీ విచారణకు హాజరుకావాలా? వద్దా ? అనే అంశంపై కీలకంగా చర్చిస్తున్నారు. నోటీసులపై కోర్టుకు వెళ్లే అంశాన్ని న్యాయనిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ నోటీసులపై ఇప్పటి వరకూ చంద్రబాబు కానీ.. నారాయణ కానీ స్పందించలేదు. బాబు ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉద్దేశపూర్వకంగానే జగన్ సర్కార్ ఇలా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోందని టిడిపి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
AP CID issues notice to Chandrababu