Friday, November 15, 2024

నారా లోకేశ్‌కు ఎపి సిఐడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రెడ్ బుక్ అంశంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఎపి సిఐడి నోటీసులు జారీ చేసింది. ’రెడ్ బుక్’ పేరుతో లోకేశ్ బెదిరిస్తున్నారని అధికారులు ఎసిబి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆయనకు నోటీసులివ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో సిఐడి అధికారులు వాట్సాప్‌లో ఆయనకు నోటీసులు పంపారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్నట్లు ఆయన వారికి సమాధానం ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 9కి వాయిదా వేసింది.

వైసిపి హయాంలో కొందరు అధికారులు అత్యుత్సాహంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని వారందరి పేర్లు రెడ్ బుక్‌లో నమోదు చేసుకున్నట్లు యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్ చెప్పారు. అధికారంలోకి వచ్చాక జ్యుడీషియల్ విచారణ జరిపించి బాధ్యులను తప్పక శిక్షిస్తామన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్క తేల్చే పుస్తకం (రెడ్ బుక్) అంటూ ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని బహిరంగ సభలో చూపించారు.

చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో ఉంచారని, అందరి పేర్లు ఇందులో రాసుకున్నాన న్నారు. ఈ రెడ్ బుక్ కాపీని ఒకటి చంద్రబాబుకు ఇస్తానని, మరొకటి తన వద్ద ఉంచుకుంటానని వెల్లడించారు. 2024లో అధికారంలోకి వచ్చాక వారిని వదిలి పెట్టబోమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తమపై కక్షసాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. దీనిపై కొందరు అధికారులు లోకేశ్ పై ఫిర్యాదు చేశారు. ‘రెడ్ బుక్’ పేరుతో తమను బెదిరిస్తున్నారని ఎసిబి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం లోకేశ్‌కు నోటీసు లివ్వాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. అయితే, ‘రెడ్ బుక్’ అంశంపై లోకేశ్ తాజాగా స్పందించారు. రాష్ట్రంలో చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో రాస్తున్నామని, తప్పు చేసిన వారి గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ‘అధికారులు తప్పు చేసినా మాట్లాడకూడదా? సిఐడినే స్క్రిప్ట్ రాసివ్వమనండి. అదే చదువుతా. లేదా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్లు స్క్రిప్ట్ రాసిస్తే అదే చదువుతా. కొల్లి రఘురామిరెడ్డి, పిఎస్సార్ ఆంజనేయులు వంటి వారు తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నారా? రెడ్ బుక్ లో ఎవరి పేర్లున్నాయో వారికెలా తెలుసు?’ అంటూ నిలదీశారు.

ఈ సందర్భంగా వైసిపిపై విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోయే స్థానాల్లోనే వైసిపి, బిసిలకు సీట్లు ఇస్తోందని విమర్శించారు. మంగళగిరిలో ఓడిపోతున్నామని తెలిసే ఇప్పుడు బిసిలకు ఇచ్చారని, గతంలో రెండు సార్లు రెడ్డిలకు ఇచ్చా రని గుర్తు చేశారు. కడప ఎంపి స్థానం, పులివెందుల సీటు బిసిలకు ఇవ్వాలని సవాల్ విసిరారు. ‘చిలకలూరిపేటకు పనికి రాని మంత్రి విడదల రజనీ గుంటూరు వెస్ట్‌లో ఎలా పనికొస్తారు? ఓ నియోజకవర్గంలో చెత్త, మరో చోట బంగారం అవుతుందా?’ అని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News