బెయిల్ రద్దు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం ఎంపి రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సిబిఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈక్రమంలో మంగళవారం నాడు ఈ పిటిషన్ అర్హతపై కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ఆర్థిక నేరాలు, అక్రమాస్తులకు సంబంధించిన 11 చార్జిషీట్లలో ఎ1గా ఉన్న ఎపి సిఎం తన పదవిని అడ్డంపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సిబిఐ అధికారులు, సాక్ష్యులను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కారణంగా బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను నాంపల్లిలోని సిబిఐ కోర్టు విచారణకు స్వీకరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపి రఘురామకృష్ణంరాజు నేరుగా సిబిఐ, ఎపి సిఎంల మధ్య లోపాయికారి ఒప్పందాలు, తాయిలాల వ్యవహారం చోటుచేసుకుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై తొలుత సాంకేతిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, మంగళవారం నాటి వాదనల తర్వాత జగన్ బెయిల్ రద్దుపై పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు జడ్జి ప్రకటించారు.
ఎపి సిఎంకు నోటీసులు:
బెయిల్ రద్దు పిటిషన్ ను సిబిఐ కోర్టు విచారణకు స్వీకరించడంతో ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డితోపాటు ఆయనపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తోన్న సిబిఐకి అనతికాలంలో నోటీసులు జారీ కానున్నాయి. జగన్ సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా, సిబిఐలోని పలువురు అధికారులతో రహస్య సంభాషణలు జరపడం, కొందరు అధికారులకు ఖరీదైన గిఫ్టులు, ఫ్లాట్లు ఇచ్చి లోబర్చుకున్నారని, కోర్టు కోరితే సంబంధిత ఆధారాలు కూడా ఇవ్వగలనని ఎంపి రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎపి సిఎం జగన్ బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు.