టిటిడి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలకు
అనుమతి ఇస్తున్నట్టు లేఖ రాసిన ఎపి సిఎం చంద్రబాబు
ఎపి సిఎంకు కృతజ్ఞతలు తెలిపిన సిఎం రేవంత్, మంత్రి కొండా సురేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి (తిరుమల తిరుపతి దేవస్థానం) తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు రాష్ట్ర ప్రజా ప్రతినిధుల (ఎంపి/ఎమ్మెల్సీ/ఎమ్మెల్యేల) సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఎపి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ ద్వారా తెలియచేశారు.
శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని, తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు ఎపి ముఖ్యమంత్రి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపి నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) విఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/-ల టికెట్) కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (ఎస్‌ఈడి) (రూ. 300ల టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయని ఎపి సిఎం పేర్కొన్నారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని చంద్రబాబు నాయుడు రాసిన లేఖలో పేర్కొన్నారు.
గతంలో తెలంగాణ సిఎం రాసిన లేఖలో….
గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టిటిడి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోవాలని ఎపి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, రాష్ట్రం నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో గుర్తుచేశారు. గత సంప్రదాయం ప్రకారం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చే విజ్ఞాపనల మేరకు స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలో కోరారు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి రాసిన లేఖకు అనుగుణంగా ఎపి ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారు.
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం అందించే కానుక: మంత్రి కొండా సురేఖ
తిరుమలలో తెలంగాణ సిఫార్సు లేఖలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సిఎం నారా చంద్రబాబు నాయుడుకు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రత్యేక దర్శనం కోసం సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగిన తమ కృషి ఫలించిందని ఆమె అన్నారు. ఎపి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడులకు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తనతో పాటు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు చేసిన కృషి ఫలించడంతో మంత్రి సురేఖ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతినిత్యం అశేష భక్తజనంతో విలసిల్లే తిరమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో రాష్ట్ర ప్రజలకు ఊరట లభించినట్లైందని మంత్రి సురేఖ తెలిపారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు అందిస్తున్న ఈ సౌకర్యాన్ని సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన సంవత్సర కానుక అని మంత్రి సురేఖ అభివర్ణించారు.