ఢిల్లీ: నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో సిఎం జగన్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని మోడీ నివాసంలో సిఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీకి వేంకటేశ్వర స్వామి ప్రతిమను జ్ఞాపికగా అందించారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని సమస్యలపై మోడీ తో చర్చించారు. దాదాపుగా 50 నిమిషాల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది.
రాష్ట్రం ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై దాదాపు రూ. 2,900 కోట్లు ఖర్చు చేసిందని, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించలేదన్నారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని సిఎం జగన్ మోడీ ని కొరారు. తమ ప్రభుత్వం వనరుల కొరతను ఎదుర్కొంటోందని, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి తాత్కాలిక ప్రాతిపదికన రూ. 10,000 కోట్ల నిధులను అందించాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు అధికారిక వర్గాల సమాచారం.