Sunday, December 22, 2024

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన పవన్ కల్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. ఆలయ వర్గాలు పవన్ కు సంప్రదాయరీతిలో స్వాగతం పలికాయి. అనంతరం, పవన్ ఇక్కడి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మొక్కులు చెల్లించుకున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఆయన గతంలోనూ కొండగట్టు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు.

ఇవాళ కొండగట్టుకు పవన్ వచ్చిన నేపథ్యంలో, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా పవన్ రాకతో కొండగట్టులో కోలాహలం మిన్నంటింది. ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. అందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు. మార్గమధ్యంలో తుర్కపల్లి క్రాస్‌రోడ్స్ వద్ద జనసేన నాయకులు గజమాలతో ఆయనను సత్కరించారు.

జనసేన ఎదుగుదలను ఆకాంక్షించిన డీఎస్…
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస్ మరణం బాధాకరమన్నారు. జనసేన పార్టీ ఎదుగుదలను డీఎస్ ఆకాంక్షించారని గుర్తుచేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న డీఎస్ ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ఉన్నత విద్య శాఖల మంత్రిగా సేవలందించారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా తన వాదం వినిపించారని కొనయాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News