Monday, December 23, 2024

ఆంధ్ర ఉద్యోగులను అనుమతించొద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోకి ఆంధ్రా ఉద్యోగుల రాకపై రగడ మొదలయ్యింది. ఇంటర్ స్టేట్ ట్రాన్సఫర్స్ ఫైల్‌కు సిఎం రేవంత్ ఆమోదం తెలపవద్దని సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎపి నుంచి తెలంగాణకు ఎస్‌ఓ, ఏఎస్‌ఓ స్థాయి ఉద్యోగులు తెలంగాణలో పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకోవడం కూడా ప్రస్తుతం సమస్య మరింత ముదిరింది. దీంతోపాటు తెలంగాణలో భర్త పనిచేస్తే భార్య ఎపిలో పనిచేస్తుంటే వారు కూడా తెలంగాణలో పనిచేయడానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇలా సుమారుగా 1500ల మంది ఉద్యోగులు తెలంగాణ సచివాలయంతో పాటు గ్రేటర్ పరిధిలో పనిచేయడానికి దరఖాస్తు పెట్టుకోవడంతో ఉద్యోగ సంఘాల నాయకులు సిఎం రేవంత్, మంత్రి పొన్నం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు.

డిప్యూటేషన్‌పై వివిధ సెక్షన్లలో…
8 సంవత్సరాల క్రితం రాష్ట్ర సచివాలయంలో కొన్ని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉమ్మడి ఎపిలో పనిచేసిన కొంతమంది ఉద్యోగులను సచివాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, డిపిఓలుగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టుల పద్ధతిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. సుమారుగా 210 మంది ఉద్యోగులు సచివాలయంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. దీంతోపాటు 2018-, 2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కొంత మంది రెగ్యులర్ ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో పనిచేయడానికి డిప్యూటేషన్‌పై వచ్చి సచివాలయంలోని వివిధ సెక్షన్లలో పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరి గడువు అయిపోయినా ఎపికి వెళ్లకుండా ఇక్కడే తిష్టవేసి సచివాలయం లేదా తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేలా చక్రం తిప్పుతున్నట్టుగా సమాచారం.

అయితే వీరికి కొందరు సచివాలయంలో పనిచేసే ఉన్నతాధికారులు అండగా ఉండి వారిని ఇక్కడే కొనసాగేలా ఫైల్‌ను మూవ్ చేసి ఆ ఫైల్‌ను సిఎంకు పంపించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్ కింద 210 మంది (ఎపికి చెందిన వారు) ఇక్కడ పనిచేస్తుండగా మరో 100 నుంచి 150 మంది పర్మినెంట్ ఉద్యోగులు సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నారని వారంతా రానున్న రోజుల్లో ఇక్కడే ఉంటే తెలంగాణ ఉద్యోగులకు తీవ్రనష్ట వాటిల్లుతుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కవని వీరివల్ల ఎపి నుంచి చాలామంది ఉద్యోగులు తెలంగాణకు రావడానికి ఆసక్తి చూపుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

మరో 1,500 మంది ఉద్యోగులు తెలంగాణలో పనిచేయడానికి …
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని సిఎం, మంత్రుల దృష్టికి ఉద్యోగుల సంఘ నాయకులు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎపి నుంచి తెలంగాణకు రావడానికి రెగ్యులర్ ఉద్యోగుల్లో 87 మంది ఉద్యోగులు సచివాలయానికి రావడం కోసం గతంలో దరఖాస్తులు పెట్టుకున్నారు. వాళ్లలో ఒక జేఎస్, ఇద్దరు డిఎస్‌లు, 11 మంది సహాయ కార్యదర్శులు, 40 మంది సెక్షన్ ఆఫీసర్లు, 19 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఆ కిందిస్థాయి ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణాకు రావడం కోసం దరఖాస్తు చేసుకున్న ఈ 87 మందిలో 10 మంది మాత్రమే ఇక్కడి స్థానికత ఉన్నవాళ్లు.

మిగిలిన వాళ్లంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాళ్లేనని తెలంగాణ ఉద్యోగులు పేర్కొంటున్నారు. అదే సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్లడానికి కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ 87 మంది ఉద్యోగులను ఎపి నుంచి తెలంగాణకు తీసుకుంటే మరో 1,500 మంది ఉద్యోగులు తెలంగాణకు రావడానికి సిద్ధంగా ఉన్నారని వారి దరఖాస్తులు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి చేరాయని కొందరు ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు కొందరు ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగం అంతా జరుగుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని తెలంగాణ ఉద్యోగసంఘాల నాయకులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News