ప్రభుత్వం ఉద్యోగం కోసం లక్షల మంది యువతీయుకులు పుస్తకాలతో కుస్తి పడుతుంటారు. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించామంటే లైఫ్ సెటిలైనట్లేనని నిరుద్యోగ యువత సంవత్సరాలుగా పుస్తకాలతో కష్టపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు సక్సెస్ అవుతుంటారు.. మరికొందరు ఫెయిల్ అవుతుంటారు.. ఇది కామన్. అయితే, మనం ఓ యువతికు హాట్సప్ చెప్పాల్సిందే. ఎందుకంటే.. మనకు ఒక్క ఉద్యోగం సంపాదించడమే కష్టమనుకుంటే.. ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించింది ఆ యువతి. అవును.. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కొత్తవీధికి చెందిన అంబటి కీర్తినాయుడు అనే యువతి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. వారెవ్వా అనేలా చేసింది. ఆమె టాలెంట్ కు అందరూ ఫిదా అవుతున్నారు.
2019లో కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసిన నోటిఫికేషన్ లో కీర్తినాయుడు ఆదాయపు పన్ను శాఖలో ఉన్నతాధికారి ఉద్యోగం సాధించింది. తర్వాత కస్టమ్స్ విభాగంలో ట్యాక్స్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. 2022 మార్చిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్‌బేస్డ్ ఉద్యోగాల్లో భాగంగా ఎంటీఎస్ ఉద్యోగం, భారత రైల్వేలో ఉన్నతాధికారిగా, పోస్టల్ విజిలెన్సు విభాగంలో మరో ఉద్యోగం సాధించింది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో గ్రామ కార్యదర్శి పోస్టుకు సైతం ఎంపికైంది. తాజాగా సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సస్‌లో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం వచ్చినట్లు నిన్న(బుధవారం) కీర్తి తండ్రి అడ్వకేట్ అంబటి మురళీకృష్ణ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు కూడా కీర్తీ సెలక్ట్ అయ్యింది. 2019లో డిగ్రీ పూర్తి చేసిన ఆమెకు ఆరు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ కొలువులు వచ్చాయి. అయితే, కీర్తి వాటిని రిజక్ట్ చేసింది. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో కీర్తి ప్రిపేర్ అవుతున్నట్లు ఆమె తండ్రి తెలిపారు.