హైదరాబాద్: పోలవరం డ్యామ్ లో మొదటగా 41.5 మీటర్ల మేరకే నీరు నింపుతామని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పూర్తిగా నీరు నింపే వాటికి ఓ ఒక్కరికీ నష్టం జరగనివ్వమన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ఒకేసారి పూర్తిగా నింపితే పోలవరం డ్యామ్ భద్రతకు ప్రమాదం వస్తుందన్నారు. డ్యామ్‌లో పూర్తిగా నీరు నింపడానికి కేంద్ర జలసంఘం ఒప్పుకోదని, మొదట డ్యామ్‌లో సగం వరకు నీరు నింపుతామని, మూడేళ్లలో డ్యామ్‌లో పూర్తిగా నీరు నింపుతామని వివరించారు. కేంద్రం నుంచి ఆ స్థాయిలో నిధులు రావాలన్నారు. కేంద్ర నిధులు రాకపోతే డ్యామ్ నింపబోమన్నారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే డ్యామ్ నింపుతామన్నారు. నిర్వాసితులకు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే తోడుగా ఉంటుందన్నారు. సెప్టెంబర్ లో పొలవరం ముంపు బాధితులకు పరిహారం ఇస్తామని జగన్ స్పష్టం చేశారు.