Monday, December 23, 2024

పోలవరంలో… ‘నిజాలకు’ పాతర

- Advertisement -
- Advertisement -

నదిలో ప్రవహించే గరిష్ట వరదనీటికి రెట్టింపు సామర్ధంతో డ్యాం నిర్మాణాలు జరగాలని, ఆ విధంగా లెక్కిస్తే పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ను 72 లక్షల క్యూసెక్కుల వరదనీటి డిశ్చార్జి సామ ర్ధంతో నిర్మించాలని, రాక్‌ఫిల్ డ్యాం సామర్థాన్ని దానికి తగినట్లుగా నిర్మించాలని అధికారులు అంటున్నారు. పస్తుతం పోలవరం స్పిల్‌వే ను 50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి సామ ర్థంతో నిర్మిస్తున్నారు. వరదనీరు ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా వేగంగా సముద్రంలో కలిసేటట్లుగా డ్యాంను నిర్మిస్తేనే బ్యాక్‌వాటర్ సమస్య, ఎగువన ముంపు సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. పోలవరం విషయంలో అలాంటివి ఏమీ జరగడంలేదు

వరద చరిత్రను విస్మరించిన
ఎపి సర్కార్ 1966లోనే 153
అడుగులు ప్రవహించిన గోదావరి
1978లో168 అడుగల వరద
ఒడిశాలోని మోటు, ఛత్తీస్‌గడ్‌లోని
కుంట వద్ద వరద రికార్డు డ్యాం
బ్రేక్ అనాలిసిస్ నివేదికలో కఠోర
సత్యాలు ఎన్‌ఐహెచ్ నివేదిక
బుట్టదాఖలు కేంద్రం జల
సంఘం సిఫారసులు బేఖాతరు

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మూలంగా తలెత్తే ముంపు సమస్యలపై అనేక కఠోరసత్యాలు వెలుగులోకి వచ్చా యి. పోలవరాన్ని నిర్మిస్తే తలెత్తే ముంపు సమస్య ల్లో అసలు నిజాలను దాచిపెట్టారని, కేంద్ర జలసంఘం సిఫారసులను కూడా పరిగణనలోకి తీ సుకోలేదని, రూర్కీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజి (ఎన్.ఐ.హెచ్) సిఫారసులను కూడా ఏపీ ప్రభుత్వ బుట్టదాఖలు చేసిందని, వీ టన్నింటి మూలంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడి శా రాష్ట్రాలకు ముంపు ప్రమాదాలు పొంచి ఉ న్నాయని నీటిపారుదల శాఖలోని కొందరు సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏదైనా ఒక భారీ ప్రాజెక్టును నిర్మించే సమయం లో నీటిపారుదల ఇంజనీరింగ్ ప్రమాణాలను పాటించాలని, ఏ నదిపైన ప్రాజెక్టును నిర్మిస్తున్నారో ఆ నదికి వచ్చిన వందేళ్ళ వరదల చరిత్ర ను పరిగణనలోకి తీసుకొని గరిష్టంగా ఏ సంవత్సరంలో వరద వచ్చిందో దానికంటే రెట్టింపు వరదనీటి డిశ్చార్జి సామర్ధంతో డ్యాం (స్పిల్ వే) ను నిర్మించాల్సి ఉంటుంది.

అలా చేస్తేనే ముంపు సమస్యలు తలెత్తకుండా, ప్రాణనష్టాలు, ఆస్తినష్టాలు సంభవించకుండా ఉంటాయని, కానీ పో లవరం ప్రాజెక్టు స్పిల్ వే నిర్మాణం విషయంలో ఈ ప్రాథమిక నిబంధనకే ఎపి ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల గోదావరి నదికి వచ్చిన కొద్దిపాటి వరదకే భద్రాచలం పట్టణం పూర్తిగా ముం పునకు గురయ్యిందని, అదే గతంలో వచ్చిన వరదలను పరిగణనలోకి తీసుకుంటే పోలవరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఎంతటి ప్రమాదకరమైన ప్రాజెక్టో ఇట్టే అర్ధమవుతుందని ఆ అధికారులు వివరించారు. 1966లో గోదావరి నదికి ఇప్పటి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కుంట, ఒరిస్సా రాష్ట్రంలోని మోటు ప్రాంతాల వద్ద 153 అడుగు ల వరకూ వరదనీరు ప్రవహించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టమే కేవలం 150 అడుగులని, పోలవరాన్ని నిర్మించకముందే 153 అడుగుల నీటిమట్టంతో గోదావరి వరదలు వచ్చాయని, ఇక పోలవరాన్ని నిర్మించిన తర్వాత బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్, ముంపు సమస్య మరెంత తీవ్రంగా ఉంటుందో అర్ధంచేసుకోవాలని కోరుతున్నారు.

అంతేగాక ఆ సమయంలో వచ్చిన 35 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర జల సంఘం 1986లో ఒకవేళ పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి కెపాసిటీతో డ్యాంను నిర్మించాలని పేర్కొంది. అయితే 1978లో మళ్ళీ గోదావరి నదికి మోటు, కుంట ప్రాంతాల వద్ద రికార్డుస్థాయిలో వచ్చిన వరద 168 అడుగులకు చేరిందని తెలిపారు. మళ్ళీ 2006లో గోదావరి నదికి 28.5 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చిందని, దాంతో ఏకంగా 370 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, దీంతో కేంద్ర జలసంఘం (సి.డబ్లు.సి) కళ్ళు తెరిచిందని, గరిష్ట వరదనీటిని పోలవరం జలాశయం నుంచి కనీసం 50 లక్షల క్యూసెక్కుల వరదనీటిని బయటకు పంపించే విధంగా స్పిల్ వే (డ్యాం)ను నిర్మించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. డ్యాం డిజైన్‌ను కూడా 50 లక్షల క్యూసెక్కుల వరదను బయటకు పంపించే మార్చుకోవాలని సి.డబ్లు.సి. సూచింది. కానీ ఎపి ప్రభుత్వం కేంద్ర జల సంఘం సిఫారసులను పట్టించుకోలేదని, దాంతో ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ టి.శివాజీరావు అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు కూడా లిఖితపూర్వకంగా చారిత్రక ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారని ఆ అధికారులు గుర్తు చేశారు.

అయినా 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాతరు చేయలేదని, కేవలం రాజకీయ పలుకుబడితోనే ప్రాజెక్టు నిర్మాణాలను ముందుకు తీసుకెళ్ళారని, పర్యావరణవేత్తల నుంచి వత్తిళ్ళు పెరిగిపోవడం, ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ క్లియరెన్స్‌ల కోసం ఎట్టకేలకు కేంద్ర జల సంఘం సిఫారసుల మేరకు ఎపి ప్రభుత్వం ఒక మెట్టుదిగి స్పిల్‌వేను 50 లక్షల క్యూసెక్కుల సామర్ధంతో నిర్మించేందుకు అంగీకరించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డి.పి.ఆర్)ను డి.పి.ఆర్.ను కేంద్రానికి సమర్పించారు. ఆ సమయంలోనే రూర్కీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజి (ఎన్.ఐ.హెచ్) సంస్థను డ్యాం బ్రేక్ అనాలిసిస్ చేయమని ఏపీ ప్రభుత్వం కోరిందని తెలిపారు. ఎన్.ఐ.హెచ్.సంస్థ పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన రాక్ ఫిల్ డ్యాం (ఆర్.ఎఫ్.డి)పై డ్యాం బ్రేక్ అనాలిసిస్ చేసిందని, దాంతో గోదావరి నదికి వచ్చిన వరద చరిత్రను పరిగణనలోకి తీసుకొని, నది ప్రవాహ స్వభావాన్ని, ప్రాజెక్టు డిజైన్‌లను పరిగణనలోకి తీసుకొని స్పిల్ వే (డ్యాం)ను 60 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్ధంతో నిర్మించాలని, లేకుంటే రాక్‌ఫిల్ డ్యాంకు ఎంతో ప్రమాదమని కూడా ఆ సంస్థ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిందని తెలిపారు.

కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం తాను కోరిన సంస్థ నివేదికను, ఆ సంస్థ సిఫారసులను కూడా పట్టించుకోకుండా అతి తక్కువ డిశ్చార్జి సామర్ధంతోనే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని, 60 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని, దాని తీవ్రతను తట్టుకొని నిలబడే విధంగా రాక్‌ఫిల్ డ్యాంగానీ, స్పిల్‌వే ల నిర్మాణాలు జరగడంలేదని ఆ అధికారులు వివరించారు. అంతేగాక సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాటించిన ఇరిగేషన్ ప్రమాణాలను కూడా పోలవరం ప్రాజెక్టు డిజైన్‌లో పాటించడంలేదని వివరించారు. నదిలో ప్రవహించే గరిష్ట వరదనీటికి రెట్టింపు సామర్ధంతో డ్యాం నిర్మాణాలు జరగాలని, ఆ విధంగా లెక్కిస్తే పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ను 72 లక్షల క్యూసెక్కుల వరదనీటి డిశ్చార్జి సామర్ధంతో నిర్మించాలని, రాక్‌ఫిల్ డ్యాం సామర్దాన్ని కూడా దానికి తగినట్లుగా నిర్మించాలని అంటున్నారు. ప్రస్తుతం పోలవరం స్పిల్‌వే ను 50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్ధంతో నిర్మిస్తున్నప్పటికీ అదికూడా చాలా తక్కువ సామర్ధమేనని, వరదనీరు ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా వేగంగా సముద్రంలో కలిసేటట్లుగా డ్యాంను నిర్మిస్తేనే బ్యాక్‌వాటర్ సమస్య, ఎగువన ముంపు సమస్యలు తలెత్తకుండా ఉంటాయని, కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో అలాంటివి ఏమీ జరగడంలేదని ఆ అధికారులు వివరించారు.

రానున్న రోజుల్లో గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్‌తో తుఫాన్లు భారీగా వస్తాయని, దాంతో గోదావరి నదికి అనూహ్యంగా, భారీ వరదలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పోలవరానికి ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తిన తర్వాత వచ్చే వరద తీవ్రత ఊహలకందని ప్రమాదకరంగా ఉంటుందని, ఈ అంశాలను ఏపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని పోలవరం ప్రాజెక్టు నిర్మాణశైలి, ఆ ప్రాజెక్టు డిజైన్లను పరిశీలిస్తుంటేనే స్పష్టమవుతోందని, అందుకే ఈ ప్రాజెక్టుపైన మరోసారి అధ్యయనం చేయాలని కోరుతున్నామని వివరించారు. ఈ మొత్తం అంశాలను పరిశీలిస్తే పోలవరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ముమ్మాటికీ ప్రాణగండమేనని అర్ధమవుతుందని అంటున్నారు. ఈ అంశాలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పి.పి.ఏ), కేంద్ర జల సంఘం (సి.డబ్లు.సి), ఏపీ ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి..అని ఆ అధికారులు అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News