ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. తమకు అర్హతలున్నా అన్యాయం జరిగిందంటూ కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, నియామకాల ప్రక్రియను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అభ్యర్థుల ఛాతీ, ఎత్తు కొలతల్లో అవకతవకలు జరిగాయని పిటిషనర్లు వాదించారు. గతంలో అర్హులైనవారిని తాజాగా అనర్హులుగా ప్రకటించారని, ఇది అక్రమమని అభ్యర్థుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఛాతీని, ఎత్తును డిజిటల్ మీటర్లతో కొలిచి, అనర్హులుగా ప్రకటించారని అభ్యర్థులు వాపోయారు. మాన్యువల్ గానే శారీరిక దారుఢ్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 56 వేలమంది ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలకు హాజరు కాగా చాలినంత ఎత్తు లేరనే కారణంతో ఐదువేలమందిని అనర్హులుగా పరిగణించారని వారు తెలిపారు. దాదాపు 35వేల మంది ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలను, రాతపరీక్షను పూర్తి చేసుకుని ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఈ సమయంలో హైకోర్టు స్టే విధించడంతో వీరంతా ఆందోళనకు గురవుతున్నారు.