హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈనెల 23 వరకు జీవో నెంబర్ 1పై సస్పెన్షన్ విధించింది. ఎపిలోని రహదార్లపై సభలు, ర్యాలీలను నిషేదిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం జీవో నెంబర్ 1 నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది.
ఈనెల 23 వరకు జీవో నెంబర్ 1పై సస్పెన్షన్ విధిస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20 నాటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రామకృష్ణ తరపున న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రజల భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను కాలరాసేలా జీవో ఉందని, కొట్టివేయాలని కోరారు.