స్వాతంత్య్రానికి పూర్వం రాజకీయాలంటే త్యాగమని కెసిఆర్ అన్నారు. జీవితాలను, ఆస్తులను, కుటుంబాలను అవసరమైతే ప్రాణాలను సైతం త్యాగం చేసేటటువంటి రాజకీయాలు ఉండేవన్నారు. ఆ తర్వాత స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో నాటి ప్రధాని నెహ్రూ ఆధ్వర్యంలో అంబేద్కర్ మార్గదర్శనంలో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకుని కార్యలకలాపాలు మొదలుపెట్టుకున్నామన్నారు. దేశ అభ్యున్నతి కోసం పంచవర్ష, వార్షిక ప్రణాళికలను రూపొందించుకున్నామన్నారు. ఇలా చక్కటి ప్రయాణాన్ని మొదలుపెట్టామని కెసిఆర్ పేర్కొన్నారు.
వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు ఒక విజన్ డైరెక్షన్ ఏ పద్ధతిలో ఈ దేశం ముందుకు పోవాలని చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు. ఇందుకోసం కొన్ని బాటలు వేయబడ్డాయన్నారు. ఆ తర్వాత రాజకీయాలు, ప్రజాజీవితంలో అనేక మార్పులు సంభవించాయని కెసిఆర్ అన్నారు. గత 50 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకు అవగాహన కలిగినటువంటి భారతదేశం ఏ దశకు చేరుకోవాలో.. ఆ దశకు చేరుకోలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలు సిద్ధించలేదన్నారు. దీని కారణంగానే దేశంలో అనేక వైశమ్యాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ధనవంతుడు మరింత ధనవంతుడుగా మారుకుంటే పేదలు మరింత పేదలుగా మారుతున్నారని అన్నారు. ఈ వ్యవస్థ మారాలన్నదే తన అభిమతమని కెసిఆర్ పేర్కొన్నారు.