Wednesday, January 22, 2025

16,347 పోస్టులతో మెగా డిఎస్సీ

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం 4.4౧ గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో తన ఛాంబర్‌లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సీ ఫైలుపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. కేటగిరీల వారీగా ఇందులో ఎస్‌జీటీ 6,371, పిఈటీ 132, స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ 52 పోస్టులు ఉన్నాయి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ఫైలుపై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు ఫైలుపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణన ఫైలుపై ఐదో సంతకం చేశారు.

చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు

చంద్రబాబునాయుడుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు సీడ్ యాక్సెస్ రోడ్డులో దారి పొడవునా పూలు చల్లి అఖండస్వాగతం పలికారు. వేలమంది రోడ్ల మీదుకు వచ్చి రహదారులన్నీ పూలమయం చేసి అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని ముఖ్యమంత్రిపై అభిమానం చాటుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా రైతులకు చంద్రబాబు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అలాగే సచివాలయ ఉద్యోగులు, అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, డీజీపీ సహా మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రుల శాఖలపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంత్రుల అభీష్టం, వారి సామర్ధాన్ని బట్టి శాఖలు కేటాయిస్తానని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం తిరుల శ్రీవారి దర్శనానికి వెళ్లి న చంద్రబాబు గురువారం అమరావతి చేరుకుని వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మంత్రుల శాఖల కేటాయింపుపై ఉండవల్లిలోని తన నివాసంలో కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం లోగా మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయిస్తారని భావిస్తున్నారు.

చంద్రబాబును కలిసేందుకు అధికారుల క్యూ

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యూ కట్టారు. గత ప్రభుత్వ హాయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అజయ్ జైన్, వై. శ్రీలక్ష్మి, పీఎస్‌ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణ తదితరులు చంద్రబాబు రాగానే సచివాలయం మొదటి బ్లాక్ వద్దకు పరుగులు పెట్టారు. గతంలో ఆయనకు వ్యతిరేకంగా అజయ్ జైన్ సిఐడికి స్టేట్‌మెంట్ ఇచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన నాటి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన పీఎస్‌ఆర్ ఆంజనేయులు పూర్తిస్థాయిలో సహకరించాలరనే అభియోగాలు ఉన్నాయి. జగన్ మోహన్‌రెడ్డి, సీఎంఓ అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మిపై ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక శాఖలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని కేవీవీ సత్యనారాయణపై అభియోగాలున్నాయి. వివాదాస్పద అధికారులు చంద్రబాబును కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతించకపోవడంతో వారు వెనుతిరిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News