ఎపిలో ముగిసిన మున్సిపల్ పోలింగ్
60శాతం ఓటింగ్ జరిగిందని వెల్లడించిన అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థల్లోని 581 డివిజన్లు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోని 1,633 వార్డులకు బుధవారం ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,213 డివిజన్లు, వార్డుల్లో కలిపి 77,73,231 మంది ఓటర్లుండగా 2,123 వార్డులకు 490 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 7,915 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరిలో పురుష ఓటర్లు 38,25,129 మంది కాగా మహిళా ఓటర్ల సంఖ్య 39,46,952. ట్రాన్స్జెండర్లు 1150 మంది ఉన్నారు. ఎన్నికలలో మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా అటు పోలీసులు, ఇటు ఎన్నికల అధికారులు 2,320 అత్యంత సమస్యాత్మక, 2,468 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఇప్పటికే పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి. స్వల్ప ఘటనలు మినహా అన్ని చోట్ల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్ నమోదైంది. ఈక్రమంలో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం 60 శాతానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారురు. కాగా ఈ నెల 14న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏలూరు కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపిన విషయం విదితమే.
AP Municipal Elections 2021 Recorded 60% polling