వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు లభ్యమవు తాయని భావిస్తున్న ఎపి పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో శనివారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు వంశీ ఇంట్లో విజయవాడలోని పటమట పోలీసులు సోదాలు చేశారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో శుక్రవారం దాదాపు రెండు గంటల పాటు పోలీసులు తనిఖీ చేశారు. ఓ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఈ సోదాల్లో పాల్గొన్నారు. వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. వల్లభనేని ఇంట్లో సీసీటీవీ ఫుటేజీని ఓ బృందం సేకరించింది. వంశీ కేసు కోసం ఎపి సీఐడీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
వంశీ ఫోన్ కోసం ఆయన ఇంట్లో విస్తృతంగా గాలించారు. అయితే, వంశీ ఇంట్లో ఫోన్ లభించకపోవడంతో నిరాశగా ఎపి పోలీసులు వెనుదిరిగారు. కానీ, వంశీ సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఫోన్ కోసం వంశీ ఇంటిని జల్లెడ పట్టారు. చివరి లొకేషన్ భూజా లొకేషన్ చూపించడంతో ఇంట్లో సోదాలు చేశారు. ఆయన ఇంట్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినా, వల్లభనేని వంశీ మొబైల్ ఫోన్ లభించలేదు. మొదటి రోజు సోదాల్లో కొన్ని కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిసి కెమెరా ఫూటే జీని సేకరించారు. వల్లభనేని వంశీ ఇంటికి సంబంధించి గత వారం రోజుల సిసిటివి విజువల్స్‌ను ఎపి పోలీసులు సేకరించారు. ఇక, శనివారం వల్లభనేని వంశీ సెల్‌ఫోన్ కోసం పటమట పోలీసులు గాలించారు. అయితే, హైదరాబాద్‌లోని వల్లభనేని వంశీ ఇంట్లో సెల్‌ఫోన్ లభించకపోవడం తో పడమట పోలీసులు తిరిగి వెళ్లిపోయారు.
గన్నవరం టిడిపి కార్యాల యంపై దాడి కేసులో 94 మంది నిందితులుగా ఉండగా ఇప్పటి వరకు ఎపి సిఐడి 40 మందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఎ71గా వంశీ ఉన్నారు. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక టీం గాలిస్తోంది. అయితే వంశీని అరెస్ట్ చేసే సమయంలో పోలీసుల కళ్లు గప్పి 40 నిమిషాల పాటు వంశీ హైడ్రామా ఆడారు. అదే సమయంలో వంశీ ఫోన్ కనపడకుండా పోయింది. శుక్రవారం కూడా ఎపి సిఐడి పోలీసులు వంశీకి ఇంటికి వచ్చారు. ఎపి సిఐడి పోలీసులు, రాయదుర్గం పోలీ సులు సంయుక్తంగా వంశీ నివాసంలో సోదాలు చేశారు. వంశీ భార్య అందుబాటులో ఉండటంతో ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లను పోలీసులు సేకరించారు. అలాగే వంశీ నివాసం వద్ద ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను కూడా సేకరించారు. కాగా గన్నవరం టిడిపి కార్యాలయం విధ్వంసం కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీమోహన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన దృశ్యాలకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు.
వల్లభనేని వంశీమోహన్‌కు విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్ పేటలోని జిల్లా జైలుకు తరలించారు. జిల్లా కారాగారంలో 14 రోజుల పాటు (ఈనెల 27 వరకు) రిమాండ్ ఖైదీగా వంశీ ఉండనున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మంది కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
‘వంశీకి ప్రాణహాని ఉంది’
విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీని ఆయన భార్య పంకజ శ్రీ ములాఖత్ అయ్యారు. విజయవాడ పోలీసుల నుంచి వంశీకి ప్రాణహాని ఉందని చెప్పారు. వంశీకి రక్షణ కల్పించాలని పంకజ శ్రీ డిమాండ్ చేస్తున్నారు.