వాయిదాకు తిరస్కరించిన సుప్రీంకోర్టు
అహంభావ పోరు మంచిదికాదని స్పష్టీకరణ
పోలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసిన ఎస్‌ఇసి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను ఎస్‌ఈసి రీషెడ్యూల్ చేసింది. గత కొన్ని రోజులుగా ఎపిలో పంచాయతీ ఎన్నికలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఎస్‌ఈసీ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధం కాగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా, ఎపి ప్రభుత్వం వేసిన పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే, ఏపీ ప్రభుత్వం ఎన్నిలకు సిద్ధంగా లేకపోవడంతో ఎస్‌ఈసీ రీషెడ్యూలు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండో దశను మొదటి దశగా, మూడో దశను రెండో దశగా, నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుగో దశగా షెడ్యూల్ ను మార్చింది. మొదటి దశకు ఈనెల 29 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో ఎపి పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసి వెల్లడించింది. కాగా, ఎన్నికలకు సహకరించబోమని కొన్ని ఉద్యోగ సంఘాలు పేర్కొనడంతో.. ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకోవాలని ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
AP SEC Issue Reschedule Panchayat Elections 2021