Sunday, September 8, 2024

పాలమూరు-రంగారెడ్డిపై సుప్రీంకోర్టుకు ఏపి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదీజలాల ఆధారంగా చేపట్టిన పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి కేటాయింపులపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖాలు చేయాలని నిర్ణయించుకుంది. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ధాల తరబడి కరువు కోరల్లో చిక్కిన దక్షిణ తెలంగాణ ప్రాంతానికి తాగునీరు, సాగు నీరు అందజేయాలన్న లక్షంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఈ పథకాన్ని చేపట్టింది. ప్రారంభ దశ నుంచే పనులు అడ్డుకునేందుకు ఏపి ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో వేసిన పిటీషన్లు ,చేసిన అభ్యంతరాలు ఫలించలేదు.

హరిత ట్రిబ్యునల్ లేవనెత్తిన అన్ని సందేహాలను తెలంగాణ ప్రభుత్వం నివృత్తి చేసింది. దీంతో హరిత ట్రిబ్యునల్ పాలమూరురంగారెడ్డి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఇటివల ఈ పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ నార్లపూర్ వద్ద ప్రారంభోత్సవం చేశారు. దీన్ని జీర్ణించుకోలేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎదో విధంగా అడ్డుకునే ప్రయత్నాలు సాగిస్తూనే వస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90టిఎంసీల నీటికేటాయింపులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై విచారణ చేపట్టాలని కృష్ణ జల వివాదాల ట్రిబ్యునల్ (కెడబ్యూడిటి2)లో కూడా వాదించింది. అయితే ఆ జీవోపై విచారణ చేపట్టే అంశం తమ పరిధిలోకి రాదంటూ ఇంటర్ లోకేటిరీ అప్లికేషన్‌ను ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఏపి ప్రభుత్వం మరో మారు ఇదే అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News