Sunday, December 22, 2024

తాగునీటి కష్టాలు తీర్చిన అపర భగీరథుడు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

గణపురం: తెలంగాణ ప్రజలకు సాగు, తాగు నీటి కష్టాలు తీర్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గతంలో తాగునీటికి బోరింగులు, బావుల చుట్టు తిరిగి చాలా ఇబ్బందులు గురయ్యామని, నేడు సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ధి చేసిన గోదావరి, కృష్ణ నది జలాలు అందించాలని ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనిని పూర్తి చేయడంలో అధికారులు, సిబ్బంది పోషించిన పాత్ర అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో అనేక అవరోధాలు వచ్చినప్పటికి వాటిని పరిష్కరిస్తూ స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటు విజయవంతంగా ఇంటింటి తాగునీటి సరఫరా చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చీకటిమయం అవుతుందని శాపాలు పెట్టిన వారు ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఇంటింటికి త్రాగునీరు అందిస్తుందని అన్నారు.

గతంలో వేసవి కాలంలో గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు వస్తే ఖాళీ బిందెల ప్రదర్శనలు, నిరసనలు ఉండేవని, నేడు వాటిని పూర్తి స్థాయిలో తొలగించామని, ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహణ సమయంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే దానిని భూతద్దంలో చూపే వారు గత దుర్బర పరిస్థితులను గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రతి మనిషి జీవితంలో నీరు చాలా ముఖ్యమైందని, దుబాయ్ దేశంలో నది జలాలు లేకపోతే సముద్రం నీటిని శుద్ది చేసి తాగుతున్నారని, గత ప్రభుత్వాలు వాగ్ధానాలు చేసి మర్చిపోతే సిఎం కెసిఆర్ పేదల గురించి ఆలోచించి మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల హాయంలో భూగర్బ జలాలు త్రాగడం వలన ఫ్లోరోసిస్ వ్యాధితో ప్రజలు బాధపడ్డారని అన్నారు. సిఎం కెసిఆర్ హయాంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక విద్యుత్ సమస్యలు, తాగునీటి సమస్యలు, సాగునీటి సమస్యలు పరిష్కరించిందని, దీని వలన దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా ఆవిర్భవించిందని అన్నారు.

గాంధీనగర్ ప్రాంతంలో జ్యోతి బా పూలే రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుచేశామని, 2 పడక గదుల ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధ్దిదారులకు అందిస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ పూర్వకాలంలో భగీరథ అనే రాజు గొప్ప ప్రయత్నం చేసి గంగను భూమిపై తీసుకొచి వచ్చారని, అదే విధంగా సిఎం కెసిఆర్ మిషన్ భగీరథ అనే గొప్ప ప్రయత్నం ద్వారా శుద్ది చేసిన నది జలాలు ఇంటింటికి సరఫరా చేశారని అన్నారు. వరంగల్ జడ్పి చైర్‌పర్సర్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తెలంగాణ మంచి నీటి పండగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. 2014 కంటే ముందు గ్రామాల్లో పర్యటిస్తే ఖాళీ బిందెల ప్రదర్శనలు, నాయకుల వాహనాలకు నీటి బిందెలు అడ్డం పెట్టె వారని, జిల్లా అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా బోర్లను ఏర్పాటుచేసి సరఫరా చేసేవారని అన్నారు.

దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇంటింటికి నల్లా ద్వారా శుద్ది చేసిన జలాలు సరఫరా లేదని, పేద ప్రజలపై సిఎం కెసిఆర్‌కు ఉన్న చిత్తశుద్ది, ప్రేమకు నిదర్శనం మిషన్ భగీరథ కార్యక్రమమన్నారు. సిద్దిపేట ఎంఎల్‌ఏగా లోయర్ మానేర్ డ్యాం నుండి తాగునీరు అందించిన సిఎం కెసిఆర్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నీటి సరఫరా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకటరాణి సిద్దు, జడ్పి వైస్ చైర్‌పర్సన్ కె శోభ, స్థానిక సర్పంచ్ జడ్పిటిసిలు, ఎంపిపిలు, ప్రజా ప్రతినిధులు, మిషన్ భగీరథ అధికారులు, జిల్లా అధికారులు, సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News