లక్నో: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బారతీయ జనతా పార్టీలో చేరడం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాది పార్టీనుంచి బయటికి వెళ్లిన ఆమె ..తాజాగా మామ ములాయం యాదవ్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోను అపర్ణ నెట్టింట షేర్ చేశారు. బిజెపిలో చేరిన తర్వాత లక్నోలో మామగారి ఇంటికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. అపర్ణ బిజెపిలో చేరడంపై అఖిలేష్ ఇప్పటికే స్పందించారు. ఆమె బిజెపిలో చేరకుండా ఆపేందుకు నేతాజీ ( ములాయం) శాయశక్తులాప్రయత్నించారని అఖిలేష్ వెల్లడించారు. అంతేకాకుండా తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.ఆమె పార్టీ మార్పు సమాజ్‌వాది పార్టీ సిద్ధాంతం విస్తరించడానికి దోహదపడుతుందన్నారు. కాగా అపర్ణా యాదవ్ ములాయం ఆశీస్సులు తీసుకోవడంపై బిజెపి అభిమాని ఒకరు ఇంటర్నెట్‌లో స్పందిస్తూ బిజెపి గెలవాలని ములాయంకూడా కోరుకుంటున్నట్లుందని వ్యాఖ్యానించారు.